OTTలో యాడ్స్ – ఆదాయమా అవరోధమా

సాధారణంగా యూట్యూబ్ వీడియోల ప్రారంభంలో మధ్యలో యాడ్స్ రావడం చూస్తున్నదే. ఉచితంగా చూడాలంటే దీన్ని భరించక తప్పదు. ఒకవేళ వద్దనుకుంటే నెలకింత చొప్పున సొమ్ములు కట్టి వాటి నుంచి తప్పించుకోవచ్చు. దీనికి ఏడాదికి పదిహేను వందలకు పైగా ఖర్చవుతుంది కాబట్టి చాలా మంది ప్రకటనలను భరిస్తూనే ఫ్రీగా సినిమాలు, ఛానల్స్ చూస్తుంటారు. కానీ పెయిడ్ రూపంలో చందాలు తీసుకునే ఓటిటిలలో ఇలా ఉండేది కాదు. కట్టిన సొమ్ముకు న్యాయం చేకూరేలా ఎలాంటి ఆటంకాలు లేని సీమ్ లెస్ ఎక్స్ పీరియన్స్ ఇవ్వడంతో కొత్త చిత్రాలు, వెబ్ సిరీస్ ల కోసం ఆడియన్స్ ఖర్చు పెట్టేవాళ్ళు.

ఇప్పుడీ ట్రెండ్స్ మారుతున్నాయి. జూన్ 17 నుంచి అమెజాన్ ప్రైమ్ లో యాడ్స్ రాబోతున్నాయి. మాకొద్దు అనుకుంటే ఇప్పటికే కడుతున్న చందాతో పాటు అదనంగా 699 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. లేదంటే ప్రకటనల ప్రహసనం భరించాలి. దీనికి సంబంధించిన సమాచారంతో ఇప్పటికే సబ్స్క్రైబర్స్ కు మెయిల్స్ వస్తున్నాయి. ఆహా ఈ మోడల్ ని గత ఏడాది నుంచే ఫాలో అవుతుండగా ఈ మధ్య ఈటీవీ విన్ లోనూ ప్రోగ్రాం ప్రారంభంలో యాడ్స్ వస్తున్నాయి. జియో హాట్ స్టార్ వాడేవాళ్ళకు ఇది ఎప్పటి నుంచో అనుభవమే. నెట్ ఫ్లిక్స్ ప్రీమియమ్ క్యాటగిరీ కాబట్టి ధరకు తగ్గట్టే ఇందులో ఎలాంటి సమస్య లేదు.

ఆదాయం కోణంలో చూసుకుంటే ఇది డిజిటల్ కంపెనీలకు లాభసాటి బేరమే కానీ క్రమంగా శాటిలైట్ ఛానల్స్ తరహాలో ఓటిటిలు కూడా యాడ్స్ మయంగా మారిపోతే ప్రేక్షకుల్లో ఆసక్తి తగ్గిపోయే ప్రమాదం లేకపోలేదు. అప్పుడు పైరసీ లాంటి అడ్డదారులు వెతుక్కుంటారు. ఇంకో కోణంలో చూసుకుంటే ఇది థియేటర్ ఫుట్ ఫాల్స్ కు సానుకూలంగా మారే అవకాశాన్ని కొట్టిపారేయలేం. ఏది ఏమైనా ఈ ధోరణికి అలవాటు పడటం రాబోయే రోజుల్లో అవసరమే. కొత్త సినిమాలు త్వరగా ఓటిటిలో వస్తే చూడకుండా ఉండలేని సగటు సినీ ప్రేమికుల బలహీనత ఇలాంటి పెంపులు, మార్పులు ఎన్ని వచ్చినా స్వాగతిస్తుంది.