మొన్న శుక్రవారం థియేటర్లలో విడుదల కావాల్సిన బాలీవుడ్ మూవీ భూల్ ఛుక్ మాఫ్ ని హఠాత్తుగా ఒక రోజు ముందు రద్దు చేసి నేరుగా మే 16 అమెజాన్ ప్రైమ్ లో ఓటిటి రిలీజ్ చేస్తామని మాడాక్ ఫిలిమ్స్ ప్రకటించడం పెను సంచలనం సృష్టించింది. అగ్రిమెంట్లు, స్క్రీన్ల కేటాయింపు, షోల పంపకాలు, అడ్వాన్సులు అన్నీ అయిపోయాక ఇలా సడన్ డెసిషన్ తీసుకోవడం పట్ల డిస్ట్రిబ్యూషన్ వర్గాలు భగ్గుమన్నాయి. ప్రముఖ మల్టీప్లెక్స్ సంస్థ పివిఆర్ ఐనాక్స్ బొంబాయి హై కోర్టులో 60 కోట్లకు దావా వేయడంతో ఈ వ్యవహారం అనుకోని మలుపు తిరిగింది. వాదనలు విన్న కోర్ట్ డిజిటల్ స్ట్రీమింగ్ ని ఆపుతూ జూన్ 16కి కేసు వాయిదా వేసింది.
ఇప్పుడీ వివాదం న్యాయస్థానం బయటే సెటిలవ్వొచ్చని ఇన్ సైడ్ టాక్. పివిఆర్ దెబ్బకు భూల్ ఛుక్ మాఫ్ ప్రొడ్యూసర్లు ఊహించని షాక్ తిన్నారు. సినిమా అనేది ఎంత నిర్మాత సొత్తే అయినా చట్టప్రకారం ఒకరికి మాటిచ్చి అమ్మకాలకు సంబంధించి రాతకోతలు చేసుకున్నాక కచ్చితంగా వాటికి లోబడాల్సిందే. 8 వారాల తర్వాత ఓటిటి రిలీజ్ చేస్తేనే తమ సముదాయాల్లో సినిమాలు వేస్తామనే నిబంధన నార్త్ మల్టీప్లెక్సులు కఠినంగా పాటిస్తున్నాయి. దానికి లోబడే ప్రొడ్యూసర్లతో ఒప్పందాలు రాయించుకుంటున్నాయి. అందుకే హిట్ 3, రెట్రో లాంటి ప్యాన్ ఇండియా మూవీస్ ఈ కండీషన్ వద్దనుకుని సింగల్ స్క్రీన్లకే పరిమితమయ్యాయి.
ఇప్పుడీ భూల్ ఛుక్ మాఫ్ పరిణామంతో పరిశ్రమ వర్గాల్లో కొత్త చర్చలు మొదలయ్యాయి. ఇకపై డీల్స్ చేసుకునే సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇదొక హెచ్చరికగా నిలిచింది. రాజ్ కుమార్ రావు, వామికా గబ్బి జంటగా నటించిన ఈ ఎంటర్ టైనర్ మీద భారీ అంచనాలు లేవు కానీ కామెడీ కంటెంట్ కాబట్టి వర్కౌట్ అవ్వొచ్చనే నమ్మకంతో బయ్యర్ వర్గాలున్నాయి. ప్రియురాలి కోసం ప్రభుత్వ ఉద్యోగం సంపాదించుకున్న యువకుడు తీరా పెళ్లి చేసుకునే సమయానికి ఊహించని ట్విస్టులు ఎదురుకుంటాడు. దాని చుట్టూ అల్లిన కథే ఈ సినిమా. మరి మే లో రిలీజ్ చేస్తారో లేక జూన్ లో వస్తారో ప్రొడక్షన్ హౌస్ ఇంకా ప్రకటన ఇవ్వలేదు.