నేచురల్ స్టార్ నాని ‘హిట్-3’తో తన కెరీర్లోనే అతి పెద్ద హిట్ కొట్టాడు. గత వారం విడుదలైన ఈ చిత్రం.. తొలి వీకెండ్లోనే రూ.100 కోట్ల గ్రాస్ కలెక్షన్లు సాధించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత కూడా ‘హిట్-3’ నిలకడగా వసూళ్లు సాధిస్తోంది. ప్రస్తుతం రెండో వీకెండ్లోనూ చెప్పుకోదగ్గ కలెక్షన్లు వస్తున్నాయి ఈ చిత్రానికి. ‘హిట్-3’ దర్శకుడి చివరి చిత్రం ‘సైంధవ్’ పెద్ద డిజాస్టర్ అయింది. అయినా అతణ్ని నమ్మి తన ప్రొడక్షన్లో ‘హిట్’ ఫ్రాంఛైజీలో మూడో సినిమాకు అవకాశమివ్వడమే కాక.. అందులో హీరోగా కూడా నటించాడు నాని. అతడి నమ్మకాన్ని శైలేష్ నిలబెట్టుకుని పెద్ద హిట్ ఇచ్చాడు. మరి వీరి కలయికలో తర్వాతి చిత్రమేంటి? మళ్లీ ఎప్పుడు కలిసి సినిమా చేస్తారు అన్నది ఆసక్తికరం. దీనికి ‘హిట్-3’ సక్సెస్ మీట్లో నాని స్వయంగా జవాబు ఇచ్చాడు.
మళ్లీ తాను హీరోగా శైలేష్ దర్శకత్వంలో సినిమా ఉంటుందని.. కానీ జానర్ మారుతుందని నాని క్లారిటీ ఇచ్చాడు. ‘హిట్’ ఫ్రాంఛైజీ ఇక ముందు కూడా కొనసాగబోతున్న సంగతి తెలిసిందే. హిట్-4లో కార్తి హీరోగా ఆల్రెడీ ఫిక్స్ అయిపోయాడు. హిట్-4 లేదా హిట్-5లో తన క్యామియో కోసం శైలేష్ అడుగుతాడని.. తన ప్రొడక్షనే కాబట్టి తప్పకుండా చేస్తానని.. ఐతే ఇది కాకుండా తాను శైలేష్ దర్శకత్వంలో వేరే సినిమా కూడా చేస్తానని నాని తెలిపాడు.
తమ కలయికలో తర్వాత వచ్చే సినిమా పక్కా కామెడీ ఎంటర్టైనర్‌గా ఉంటుందని అతను వెల్లడించాడు. శైలేష్ హిట్ సిరీస్‌లో వరుసగా థ్రిల్లర్లు తీసి ఉండొచ్చని.. కానీ అతడిలో మంచి కామెడీ సెన్స్ ఉందని నాని చెప్పాడు. సెట్లో ఎప్పుడూ జోకులు పేలుస్తూ ఉంటాడని.. తన సెన్సాఫ్ హ్యూమర్ సూపరని నాని కితాబిచ్చాడు. శైలేష్‌కు కూడా మంచి కామెడీ సినిమా చేయాలనుందని.. తనకు ఒక ఐడియా కూడా చెప్పాడని.. అది తనకు నచ్చిందని.. కాబట్టి తామిద్దరం మళ్లీ కలిసి సినిమా చేస్తే అది హిలేరియస్ కామెడీ ఎంటర్టైనర్‌గా ఉంటుందని నాని చెప్పాడు. బహుశా రెండు మూడేళ్ల తర్వాత ఈ సినిమా ఉంటుందేమో.