ఎక్కువ ఊహించుకోకమ్మా కీర్తీ

Keerthy Suresh

మ‌హాన‌టి సినిమాలో సావిత్రి పాత్ర పోషించేందుకు కీర్తి సురేష్‌ను ద‌ర్శ‌కుడు నాగ్ అశ్విన్ ఎంచుకున్న‌పుడు పెద‌వి విరిచిన వాళ్లే ఎక్కువ‌. దానికి ముందు ఆమె చేసిన నేను శైల‌జ‌, నేను లోక‌ల్ సినిమాలు హిట్ట‌యి ఉండొచ్చు, వాటిలో కీర్తి క్యూట్‌గా క‌నిపించి ఉండొచ్చు కానీ.. న‌టిగా మాత్రం గొప్ప పెర్ఫామెన్ప్ ఏమీ ఇవ్వ‌లేదు. ఆ సినిమాల్లో అందుకు అవ‌కాశం కూడా త‌క్కువే.

మ‌హాన‌టి అని టైటిల్ పెట్టి సావిత్రి పాత్ర‌ను తెర‌మీదికి తెస్తున్న‌పుడు ఆమెను మ్యాచ్ చేసే న‌టి ఉంటే బాగుంటుంద‌ని, కీర్తి అందుకు త‌గద‌ని చాలామంది అన్నారు. కానీ అలా అన్న వాళ్లంద‌రూ ముక్కున వేలేసుకుని చూసేలా, సినిమా అయ్యేస‌రికి లెంప‌లేసుకునేలా చేసింది కీర్తి. ఈ సినిమాతో ఆమెకొచ్చిన పేరు అంతా ఇంతా కాదు. దాంతో పాటు ఉత్త‌మ న‌టిగా జాతీయ అవార్డు కూడా అందుకుంది.

ఐతే మ‌హాన‌టి సినిమా త‌ర్వాత కీర్తి సినిమాల ఎంపిక‌లో పెద్ద పెద్ద బ్లండ‌ర్సే చేసిన‌ట్లు క‌నిపిస్తోంది రిలీజ‌వుతున్న ఒక్కొక్క సినిమా చూస్తుంటే. పెంగ్విన్ ఎంత పేల‌వ‌మైన క‌థో నాలుగు నెల‌ల కింద‌టే చూశాం. అందులో కీర్తి పాత్ర జీర్ణించుకోలేని విధంగా ఉంది. ఇప్పుడు మిస్ ఇండియా మూవీ చూస్తే పెంగ్విన్‌యే న‌యం అనిపిస్తోంది. ఈ సినిమా చూశాక కీర్తి త‌న‌ను తాను ఎక్కువ ఊహించుకుంటోందేమో అనిపిస్తోంది. మ‌హాన‌టిలో న‌టించిన అనుభ‌వం ఎంత‌మాత్రం ఆమెకు ఉప‌యోగ‌ప‌డ‌లేద‌నిపిస్తోంది. సినిమాలో ఆమెకు ఇచ్చిన ఎలివేష‌న్లు, పంచ్ డైలాగులు, వెనుక బ్యాగ్రౌండ్ స్కోర్లు చూస్తే ఒక పెద్ద మాస్ హీరోలా ఫీలైపోతున్న‌ట్లు క‌నిపించింది.

ఈ విష‌యంలో కీర్తిదే త‌ప్పు అన‌లేం కానీ.. ద‌ర్శ‌కుడి బాధ్య‌తే ఎక్కువ కానీ.. త‌న‌కు అంత బిల్డ‌ప్ అవ‌స‌రం లేద‌ని చెప్పాల్సిన బాధ్య‌త కీర్తి మీదా ఉంది. ఇక్క‌డే సాయిప‌ల్ల‌వి లాంటి హీరోయిన్లు త‌మ ప్ర‌త్యేక‌త‌ను చాటుకుంటారు. న‌టిగా ఆమెకూ గొప్ప పేరే ఉంది. కానీ ఇలా అర్థం లేని బిల్డ‌ప్‌లు, ఎలివేష‌న్లు ఆమె సినిమాల్లో క‌నిపించ‌వు. ఒక‌వేళ ఫిలిం మేక‌ర్స్ ఆ ప్ర‌య‌త్నం చేసినా.. దాన్ని అండ‌ర్ ప్లే చేయాల్సిన బాధ్య‌త హీరోయిన్ల‌పై ఉంటుంది. కీర్తి ఆ విష‌యంలో త‌ప్ప‌ట‌డుగు వేసింద‌ని మిస్ ఇండియాతో స్ప‌ష్ట‌మైంది. ఇక‌నైనా ఆమె జాగ్ర‌త్త ప‌డ‌కుంటే క‌ష్టం.