రివ్యూలు…కలెక్షన్లు…ఏది అసలు సమస్య ?

ఇండస్ట్రీలో ఇప్పుడు రివ్యూల మీద పెద్ద చర్చే జరుగుతోంది. కనీసం వారం పాటు వీటిని కట్టడి చేయగలిగితే కలెక్షన్లు పెరుగుతాయనే అభిప్రాయంలో కొందరు పెద్దలు ఉండటంతో ఆ దిశగా చర్చలు జరుగుతున్న వైనం పరిశ్రమలో కనిపిస్తోంది. ఒక సినిమా బాగుంటే దాన్ని ఎవరూ చంపలేరని, ఆపలేరని తెలిసి కూడా ఇలాంటి సాహసోపేత ఆలోచన చేయడం విచిత్రమే. నిజానికి రివ్యూలు ఇప్పటివి కాదు. సుప్రసిద్ధ రచయిత ముళ్ళపూడి వెంకటరమణ కాలం నుంచి ఆంధ్రభూమి దినపత్రికకు పాపులారిటీ తెచ్చి పెట్టిన వెన్నెల పేపర్లోని రివ్యూల దాకా వీటి ప్రస్థానం దశాబ్దాల నుంచి కొనసాగుతూ వస్తోంది. కొత్తగా పుట్టుకు రాలేదు.

పెరుగుతున్న టెక్నాలజీలో కొత్త రూపాలు సంతరించుకుంది అంతే. వెబ్ సైట్లు పెరిగాయి. యుట్యూబర్లు వచ్చారు. ట్విట్టర్ లో అభిప్రాయాలు వెల్లువెత్తడం మొదలయ్యాయి. సోషల్ మీడియా వాడకం పీక్స్ కు చేరుకుంది. అంతెందుకు కొన్ని లక్షల వాట్సాప్ గ్రూపులు కేవలం సినిమాల డిస్కషన్ల కోసం నడుస్తున్నవి ఉన్నాయి. సో నియంత్రించడం, ఆపడం జరగని పని. దర్శక నిర్మాతలకు నేరుగా సంబంధాలున్న ప్రింట్, డిజిటల్ మీడియాని కొంత వరకు నయానో బ్రతిమాలో భయానో కొంత మేరకు ఆపగలిగినా ఎవరి హద్దుల్లోనూ ఉండని నెటిజెన్లకు ఎవరు కంట్రోల్ చేస్తారు. అసలిది ఊహకందని విచిత్రమైన చర్య.

సినిమా పబ్లిక్ ప్రాపర్టీ. అభిప్రాయం చెప్పే హక్కు ఏ రూపంలో అయినా ఎవరికైనా ఉంటుంది. అది తప్పని చట్టం సైతం చెప్పలేదు. ఉదాహరణకు ఒక హోటల్ లో ఫుడ్డు ఘోరంగా ఉందనుకుందాం. ఓ కస్టమర్ దాని గురించి ఆధారాలతో సహా ఎక్కడో పోస్ట్ చేశాడు. అలాని వినియోగదారుడి మీద చర్య తీసుకుంటారా లేక రెస్టారెంట్ ఓనర్ ని భాద్యుణ్ని చేస్తారా. సింపుల్ ప్రశ్న కదా. అలాంటప్పుడు టికెట్ కొని, తన ఒపీనియన్ ని చెబుతున్న ఎవరిని వేలెత్తి చూపడానికి అవకాశం ఉండదు. పద్దెనిమిది వందల కోట్లు వసూలు చేసిన పుష్ప 2 బాలేదని అన్నవాళ్లున్నారు, మొదటిరోజే టపా కట్టిన రాబిన్ హుడ్ బానే ఉందన్న వాళ్ళున్నారు.

క్వాలిటీ బాగుంటే ఏ సమస్యలూ లేవు. ఎవరు ఏం రాసినా, తప్పుడు ప్రచారంతో ఎలాంటి వీడియోలు పోస్ట్ చేసినా అవి పబ్లిక్ తీర్పు ముందు నిలబడవు. కృత్రిమ ప్రమోషన్లతో ఓపెనింగ్స్ తేవొచ్చేమో కానీ లాంగ్ రన్ తేలేరుగా. బాలేదని చెప్పినంత మాత్రాన బాగున్న సినిమాకు దూరంగా ఉండేంత అమాయకత్వంలో ఇప్పటి తరం ప్రేక్షకులు నిస్సందేహంగా లేరు. అంతెందుకు అర్జున్ రెడ్డి రీమేక్ కబీర్ సింగ్ టైంలో దాని మీద బాలీవుడ్లో ఎంతో విషం చిమ్మారు. కట్ చేస్తే షాహిద్ కపూర్ కు రెండు వందల కోట్ల బ్లాక్ బస్టర్ దక్కింది. విపరీతమైన హైప్ సృష్టించిన లైగర్ లాంటి డిజాస్టర్లు మొదటి వీకెండ్ కే చేతులెత్తేయడం మర్చిపోలేంగా.

ఏతావాతా చెప్పొచ్చేదేంటంటే కంటెంట్ మీద దృష్టి పెట్టి దాన్ని ప్రమోషన్ల ద్వారా పై స్థాయికి తీసుకెళ్తే ప్రతి సినిమా బ్లాక్ బస్టర్ అందుకుంటుంది. వేయి అబద్దాలు చెప్పి ఒక పెళ్లి చేయమంటారు. ఇదే తరహాలో కొందరు నిర్మాతలు కలెక్షన్ల గురించి, పబ్లిక్ టాక్స్ గురించి వందల అబద్దాలు చెప్పి పబ్లిసిటీ చేసుకుంటారు. రెండూ తప్పు కాదు. అవసరం కోసం చేయాల్సిన పనులు. కానీ రివ్యూలు, టాక్స్ అబద్దం చెబితే ఎప్పుడో ఒకేసారి దొరికిపోతాయి. జనాలు నమ్మడం మానేస్తారు. కాబట్టి భయం ఉంటుంది. ఇదంతా ఏదో సమీక్షలను సమర్ధించేందుకు ప్రయాస పడటం కాదు. వాస్తవాలను కళ్ళముందు ఉంచే చిన్న ప్రయత్నం.