ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇప్పుడు బ్యాలన్స్ ఉన్నవి కాకుండా కొత్త సినిమాలు ఏవీ చేస్తారనే దాని గురించి రకరకాల ప్రచారాలు బయట జరుగుతున్నాయి. ఒక బాలీవుడ్ మీడియా వర్గం జాట్ దర్శకుడు గోపీచంద్ మలినేనితో పవర్ స్టార్ కాంబో ఉంటుందని ప్రచారం చేయడంతో అభిమానులు ఆశ్చర్యపోయారు. అయితే ఇది నిజం కాదు. ఎందుకంటే చాలా అర్జెంట్ గా పూర్తి చేయాల్సిన హరిహర వీరమల్లుని ఫినిష్ చేయడానికే బోలెడు అడ్డంకులు తగులుతున్నాయి. ఇంకా ఓజి ఉంది. ఆ తర్వాత ఉస్తాద్ భగత్ సింగ్ కు ఎక్కువ డేట్లు ఇవ్వాలి. ఇవి జరిగితే చాలు పవన్ పూర్తిగా పాలనకు అంకితమైపోవచ్చనేది ఫ్యాన్స్ ఫీలింగ్.
ఎప్పుడో ఓకే చెప్పిన సురేందర్ రెడ్డి సినిమానే రద్దు దిశగా వెళ్తోందనే టాక్ ఉంది. అదే కథతో వేరే హీరోతో ఆయన లాక్ చేసుకోవడం దాదాపు ఖాయమేనని ఫిలిం నగర్ టాక్. అలాంటప్పుడు కొత్తగా గోపిచంద్ మలినేనికి పచ్చ జెండా ఊపడం జరగని పని. పైగా అతను బాలకృష్ణతో రెండో సారి తమ కలయికని రిపీట్ చేయడానికి సర్వం సిద్ధం చేసుకుంటున్నాడు. స్క్రిప్ట్ లాకైపోతే వెంటనే అనౌన్స్ మెంట్ వస్తుంది. త్వరలోనే జరిగేలా ఉంది. సో పవన్ కోసం సబ్జెక్టు రెడీ చేయడం, వినిపించడం కేవలం ఊహాగానం మాత్రమే. పవన్ ఉన్న బిజీ షెడ్యూల్ చూసి అసలు ఎవరైనా నిర్మాత ముందుకు రావడమే పెద్ద టాస్కులా ఉంది.
సో పవన్ నుంచి హరిహర వీరమల్లు పార్ట్ 1, ఓజి, హరిహర వీరమల్లు పార్ట్ 2, ఉస్తాద్ భగత్ సింగ్ తర్వాత ఇంకెవరితో సినిమాలు ఉంటాయనేది ఇప్పట్లో తెగని టాపిక్. ఆ మధ్య ఒక తమిళ ఛానల్ వెబ్ ఇంటర్వ్యూలో జనసేన నిధుల కోసం నటిస్తానని పవన్ కళ్యాణ్ అన్నప్పటికీ ప్రాక్టికల్ గా పరిస్థితులు దానికి సహకరించడం లేదు. రాజకీయ, వ్యక్తిగత కారణాలు ప్రతిబంధకంగా మారుతున్నాయి. సో ఇంకో ఏడాది తర్వాత ఏదైనా కొత్త కమిట్ మెంట్ల గురించి ఆలోచించవచ్చు కానీ అప్పటిదాకా నో ఛాన్స్. అన్నట్టు మే 9 రావాల్సిన వీరమల్లు నిజంగా వస్తాడా అంటే ఇప్పటికీ సందేహాలు వ్యక్తమవుతూనే ఉన్నాయి.