నాని రిస్కీ ఆట – కనిపించని కోణాలు

నిన్న విడుదలైన హిట్ 3 ది థర్డ్ కేస్ ట్రైలర్ ఇరవై నాలుగు గంటలు గడవకముందే 21 మిలియన్ల వ్యూస్ దాటేయడం టయర్ 2 హీరోల్లో కొత్త రికార్డు నమోదు చేసింది. గతంలో ఇది లైగర్ పేరు మీద ఉండేది. ఇంత భారీగా చూశారంటే ప్రేక్షకులలో దీని మీద ఏ స్థాయిలో అంచనాలున్నాయో అర్థం చేసుకోవచ్చు. మూడు నిమిషాల వీడియోని వయొలెన్స్, రక్తపాతంతో నింపిన తీరు అమాంతం హైప్ పెంచేలా ఉంది. ఎంటర్ టైన్మెంట్ జోలికి వెళ్లకుండా అవుట్ అండ్ అవుట్ యాక్షన్ మోడ్ లో దర్శకుడు శైలేష్ కొలను ఇచ్చిన ట్రీట్ మెంట్ టాలీవుడ్ తెర మీద ఇప్పటిదాకా చూడనట్టే ఉంది. నాని ఎగ్జైట్ అవుతున్నది దాని వల్లే.

నాని ఆడబోయే రిస్కీ ఆటలో బొమ్మా బొరుసు లాగా రెండు కోణాలున్నాయి. కంటెంట్ లో హింస ఎక్కువగా ఉంటుంది కాబట్టి సున్నిత మనస్కులు, ఫ్యామిలీస్ చూడొద్దని నానినే ఓపెన్ స్టేట్ మెంట్ ఇస్తున్నాడు. దీని వల్ల ఆయా వర్గాలు థియేటర్లకు రాకుండా ఇంట్లో ఉండిపోయే ప్రమాదముంది. అయినా ఇంత ఓపెన్ గా ఆ మాట అన్నాడంటే కారణం ఒకటే. మోతాదులో ఉన్నా, మితిమీరినా జనాలకు సినిమా  నచ్చితే బ్లాక్ బస్టర్ చేస్తారని మార్కో, కిల్ లాంటివి నిరూపించాయి. కానీ పరిమిత ఆడియన్స్ ని టార్గెట్ చేసుకోవడం వల్ల వసూళ్ల పరంగా పరిమితి ఏర్పడుతుంది. అంటే వంద కోట్లు టార్గెట్ పెట్టుకుంటే ఓ పాతిక దాకా తగ్గిపోవచ్చు.

సో చేస్తున్న సినిమాలో ఎంత రిస్క్ ఉందో నాని చాలా స్పష్టమైన అవగాహన ఉంది. పైగా నెక్స్ట్ రాబోయే ది ప్యారడైజ్ ఇంతకన్నా బోల్డ్ స్టోరీ కనక ముందస్తుగానే పబ్లిక్ ని ప్రిపేర్ చేయడంలో భాగంగా హిట్ 3ని రెండో మెట్టుగా వాడుకోవచ్చు. దసరాతో మొదటి మెట్టు ఆల్రెడీ ఎక్కేశాడు. మధ్యలో సాఫ్ట్ జానర్ లో హాయ్ నాన్న చేసింది తనను ఇష్టపడే వర్గం కోసమని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సో నెంబర్ గేమ్స్ మీద నానికి ఆసక్తి ఉందో లేదో కానీ తన అడుగులు మాత్రం మార్కెట్, ఇమేజ్ రెండూ ప్యాన్ ఇండియా వైపే తీసుకెళ్తున్నాయి. సరైన ఫలితాలు దక్కితే మటుకు నాని ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా టయర్ 1 లీగ్ కి దగ్గరవ్వడం ఖాయం.