కరువు రోజుల్లో కాంచనకు కాసులు

కొత్త సినిమాలకే థియేటర్లలో జనం లేక ఎగ్జిబిటర్లు లబోదిబోమంటున్న టైమిది. అలాంటిది రీ రిలీజులకు జనాన్ని ఆశించడం కష్టమే. మొన్నటికి మొన్న మహేష్ బాబు అతడుని పెద్ద హంగామా మధ్య రెండోసారి పునః విడుదల చేశారు. కానీ వర్కౌట్ కాలేదు. హైదరాబాద్ లాంటి ఒకటి రెండు చోట్ల మినహాయించి మిగిలిన సెంటర్లలో ప్రభావం చూపించలేదు. అలాంటిది ఒక డబ్బింగ్ మూవీ అది కూడా ఎప్పుడో పదిహేను సంవత్సరాల క్రితం వచ్చిన ఒక హారర్ చిత్రం వసూళ్లు రాబట్టడం విచిత్రమే.

నిన్న కాంచనని ఏపీ తెలంగాణతో పాటు తమిళనాడులో తెలుగు వెర్షన్ రీ రిలీజ్ చేశారు. అడ్వాన్స్ బుకింగ్స్ తోనే బుక్ మై షో ట్రెండింగ్ లోకి వచ్చిన కాంచన నిన్న మంచి నెంబర్లు చూసింది. చాలా చోట్ల సగం నుంచి హౌస్ ఫుల్స్ దాకా పెద్ద ఎత్తున ఆక్యుపెన్సీలు కనిపించాయి. సుమారు రెండు నుంచి మూడు కోట్ల మధ్యలో గ్రాస్ వచ్చి ఉంటుందని ట్రేడ్ టాక్. ఈ నెంబర్ ఆషామాషీ కాదు. అది కూడా పెద్దగా ఫామ్ లో లేని లారెన్స్ రాఘవేంద్ర మూవీ నుంచి ఎవరూ ఎక్స్ పెక్ట్ చేయలేదు.

ఇంత రెస్పాన్స్ వెనుక కారణం లేకపోలేదు. టాలీవుడ్ మూవీ లవర్స్ లో ‘ముని’ సిరీస్ కు మంచి ఫాలోయింగ్ ఉంది. పరమ రొటీన్ గా అనిపించే కాంచన 3 మన దగ్గరే కమర్షియల్ గా ఎక్కువ వర్కౌట్ అయిన సందర్భాన్ని మర్చిపోకూడదు. దానికి తోడు లారెన్స్ ని బిగ్ స్క్రీన్ మీద చూసి చాలా గ్యాప్ వచ్చేసింది. సో అది ఎంజాయ్ చేయాలంటే కాంచన కంటే మంచి సందర్భం దొరకదు కాబట్టి సినీ ప్రియులు, ఫ్యాన్స్ దాన్ని శుభ్రంగా వాడేసుకున్నారు.

బాక్సాఫీస్ డ్రైగా ఉన్న టైంలో కాంచన వల్ల పలు థియేటర్లు కొంత రిలీఫ్ అందుకున్నాయని చెప్పొచ్చు. ఎందుకంటే మార్చి 19 దురంధర్ రివెంజ్, ఉస్తాద్ భగత్ సింగ్ వచ్చే దాకా కాంచననే ఫీడింగ్ గా ఉపయోగపడనుంది. వీకెండ్ కాబట్టి డ్రాప్ అవసరం పడకుండా పికప్ ఉంటుందని బయ్యర్లు అంచనా వేస్తున్నారు. లారెన్స్ ఇదంతా చూసి సంబరపడుతూ ఉంటాడు. ఇంత గ్యాప్ తర్వాత కూడా తన మీద ఇంత అభిమానాన్ని చూపిస్తుంటే థాంక్స్ చెప్పడం చిన్న మాటే అవుతుంది.