ప్రభాస్ అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్న స్పిరిట్ కు రంగం సిద్ధమవుతోంది. చేతిలో ఉన్న ఫౌజీ, ది రాజా సాబ్ వేగంగా పూర్తి చేసేందుకు ఆయా దర్శకులకు సూచనలు వెళ్లినట్టు ఫిలింనగర్ టాక్. రాబోయే నాలుగైదు నెలల్లో ఈ రెండూ కంప్లీట్ అయితే తర్వాత సందీప్ రెడ్డి వంగా సూచనల మేరకు కేవలం స్పిరిట్ మూవీకే డార్లింగ్ అంకితం కాబోతున్నట్టు తెలిసింది. ఇన్ సైడ్ టాక్ ప్రకారం స్క్రిప్ట్ పనులు దాదాపు కొలిక్కి వచ్చేశాయి. సందీప్ సాధారణంగా తీసుకునే సమయం కంటే స్పిరిట్ ఎక్కుడ డిమాండ్ చేసిందట. ప్రతిదీ పెర్ఫెక్ట్ అనిపించుకున్నాకే ఫైనల్ చేయడం అతని శైలి కాబట్టి ఇందులో ఆశ్చర్యం లేదు.
ప్రాధమికంగా అందుతున్న సమాచారం మేరకు స్పిరిట్ సెప్టెంబర్ లేదా అక్టోబర్ లో సెట్స్ కు వెళ్లనుంది. దీని కోసమే ప్రభాస్ ప్రత్యేకంగా బరువు తగ్గి ఫిజిక్ ని మార్చుకోబోతున్నాడు. రూత్ లెస్ (జాలి దయ లేని) పోలీస్ ఆఫీసర్ పాత్ర కాబట్టి దానికి తగ్గ శరీరాకృతిని మలుచుకోబోతున్నట్టు చెబుతున్నారు. యుఎస్, కొరియా నుంచి ఎంపిక చేసిన యాక్టర్లు ఇందులో భాగం కాబోతున్నారు. విలన్ గా డాన్లీ పేరు వినిపిస్తోంది కానీ ఇంకా అఫీషియల్ గా చెప్పలేదు. దీన్ని కేవలం ఇండియాలో మాత్రమే షూట్ చేయట్లేదు. వివిధ దేశాల్లో చిత్రీకరణ ఉంటుందని, ఊహించని మలుపులు అక్కడే ఉంటాయని అంటున్నారు.
2027 విడుదల టార్గెట్ గా పెట్టుకున్న సందీప్ రెడ్డి వంగా ఒక ఏడాది పూర్తిగా షూట్ కే కేటాయించబోతున్నాడు. ఆ తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ కోసం తగినంత సమయం ఉంటుంది. యానిమల్ తర్వాత మూవీ కావడంతో బాలీవుడ్ సర్కిల్స్ లో దీని మీద విపరీతమైన డిమాండ్ ఉంది. నిర్మాణ సంస్థలు టి సిరీస్, భద్రకాళి పిక్చర్స్ కి అప్పుడే ఆఫర్ల వర్షం మొదలయ్యిందట. ఓటిటి ఎంక్వయిరీలు సైతం కళ్ళు చెదిరే ఆఫర్లు ఇస్తున్నాయని అంటున్నారు. సందీప్ రెడ్డి వంగా ఇవేవి ఫైనల్ చేసే మూడ్ లో లేడు. షూట్ మొదలయ్యాక ప్రోగ్రెస్ ని బట్టి ఎంత రేట్లు ఉండాలనేది డిసైడ్ చేయబోతున్నారట. సో లాంగ్ వెయిటింగ్ తప్పదు.