ఒక టీజర్ కోసం స్టార్ హీరో అభిమానులు ఎదురు చూడటం మాములే కానీ పెద్ది విషయంలో మాత్రం ఇది కొంచెం స్పెషల్ గా అనిపించింది. ఎందుకంటే మూడేళ్ళ విలువైన కాలాన్ని గేమ్ ఛేంజర్ కోసం త్యాగం చేసిన రామ్ చరణ్ కు దానికి తగ్గ ఫలితం దక్కకపోవడం ఫ్యాన్స్ ని తీవ్ర నిరాశలో ముంచెత్తింది. అందుకే కేవలం ఒక్క సినిమా అనుభవమే ఉన్న బుచ్చిబాబు మీద టన్నుల కొద్దీ నమ్మకాన్ని పెట్టుకున్నారు. అతను ఎంచుకున్న క్యాస్టింగ్, రెహమాన్ సంగీతం, భారీ బడ్జెట్ వగైరాలు అంచనాలను ఎక్కడికో తీసుకెళ్లిపోయాయి. అందుకే అందరి కళ్ళు ఇవాళ ఫస్ట్ షాట్ పేరుతో కట్ చేసిన టీజర్ మీదే ఉన్నాయి.
నిడివి కేవలం 64 సెకండ్లే అయినప్పటికీ పెద్ది ప్రపంచాన్ని పరిచయం చేయడంలో బుచ్చిబాబు సూపర్ సక్సెసయ్యాడు. ఒకే పని చేయడానికి ఇంత బ్రతుకు ఎందుకు, ఏదైనా ఈ నేల మీద ఉన్నప్పుడే చేసెయ్యాలనే పెద్ది సిద్ధాంతాన్ని పరిచయం చేసి పల్లెటూళ్ళో ఆటలు ఆడే మాస్ కుర్రాడిగా రామ్ చరణ్ మేకోవర్ ఫ్యాన్స్ కి మాములు కిక్ ఇచ్చేలా లేదు. నిర్మాత రవిశంకర్ అన్నట్టు చివర్లో క్రికెట్ బ్యాటుని నేలకు బలంగా తాకించి బంతిని సిక్సర్ కొట్టే షాట్ మాత్రం థియేటర్లను ఊగిపోయేలా చేయడం ఖాయం. మాసిపోయిన చొక్కా ప్యాంటుతో చరణ్ పెట్టే పరుగులు బాక్సాఫీస్ ని ఎలా కమ్ముతాయో చూడాలి.
విడుదల తేదీని వచ్చే ఏడాది మార్చి 27 గా ప్రకటించేశారు. సో ఇంకో సంవత్సరం వేచి చూడాలన్న మాట. ఆశ్చర్యకరంగా ఏఆర్ రెహమాన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఎలివేషన్ కు చాలా ప్లస్ అయ్యింది. ఫ్యాన్స్ అంతో ఇంతో అనుమాన పడింది దీని గురించే కానీ బుచ్చిబాబు ఆ భయాన్ని తగ్గించేశాడు. రిలీజ్ ఇంకా చాలా దూరం ఉంది కనక కథకు సంబంధించిన క్లూస్, ఇతర క్యాస్టింగ్ తాలూకు ఫస్ట్ లుక్స్ కానీ ఏమి లేకుండా సింపుల్ గా కట్ చేసినా పవర్ ఫుల్ గా చూపించాడు బుచ్చిబాబు. గురువు సుకుమార్ ని ఫాలో అవుతూనే తనదైన మాస్ ముద్రని పెద్ది ఫస్ట్ షాట్ రూపంలో రామ్ చరణ్ ని గొప్పగా చూపించేశాడు.