నిన్న కూలీ విడుదల తేదీని ఆగస్ట్ 14 అని ప్రకటించాక ట్రేడ్ వర్గాలతో పాటు అభిమానుల్లోనూ ఈ వార్త హాట్ టాపిక్ గా మారిపోయింది. చాలా కాలంగా బాక్సాఫీస్ చూడని అతి పెద్ద ఫైట్ ని చూడబోతున్నామని బాలీవుడ్ మీడియా క్యాప్షన్లు పెట్టేసి మరీ కథనాలు రాస్తోంది. ఈ నేపథ్యంలో వార్ 2 నిజంగా అదే డేట్ కి వస్తుందా రాదానే అనుమానాలు లేకపోలేదు. కొద్దిరోజుల క్రితం యష్ రాజ్ ఫిలింస్ అలాంటి వాయిదాలేమి లేవని నిర్ధారించగా తాజాగా ఒక ప్రైవేట్ ఈవెంట్ లో పాల్గొన్న హృతిక్ రోషన్ ఖచ్చితంగా తమ సినిమా ఆగస్ట్ 14నే వస్తుందని పబ్లిక్ స్టేజి మీద కన్ఫర్మేషన్ ఇవ్వడంతో కాసిన్ని డౌట్లు కూడా తీరిపోయాయి.
ఇక బిగ్గెస్ట్ క్లాష్ కోసం ఎదురు చూడటమే మిగిలింది. ఇదొక్కటే కాదు హృతిక్ రోషన్ తన కో స్టార్ జూనియర్ ఎన్టీఆర్ గురించి గొప్పగా పొగిడాడు. సహనటుల్లో అతనితో పని చేయడం అద్భుతంగా అనిపించిందని, తమ కాంబోలో బ్యాలన్స్ ఉన్న సాంగ్ షూట్ కోసం ఎదురు చూస్తున్నానని చెప్పి మరో అప్డేట్ ఖరారు చేశాడు. తారక్ ని సంబోధించిన తీరు చూసి ఫ్యాన్స్ మురిసిపోతున్నారు. హృతిక్ కు ఆ మధ్య అనారోగ్యం కలగకపోయి ఉంటే ఈపాటికి గుమ్మడికాయ కొట్టేసేవాళ్ళు. తన వల్లే చిన్న బ్రేక్ పడింది. ఇది పూర్తి చేసుకుని ప్రశాంత్ నీల్ ప్యాన్ ఇండియా సెట్లో అడుగు పెట్టేందుకు జూనియర్ రెడీ అవుతున్నాడు.
ఇదంతా బాగానే ఉంది కానీ ఇండిపెండెన్స్ డేకి థియేటర్ల సర్దుబాటు రెండు సినిమాలకు పెద్ద సవాల్ కాబోతున్నాయి. డిస్ట్రిబ్యూషన్ పరంగా రెండు సంస్థలకు పెద్ద నెట్ వర్క్ ఉండటంతో స్క్రీన్ల విషయంలో పంతాలు పట్టింపులు రాకుండా పోవు. ఇంకో విశేషం రెండు సినిమాలూ మల్టీ స్టారర్ కావడం, వందల కోట్ల బడ్జెట్ తో రూపొందటం. కాకపోతే కూలీ వేగంగా పూర్తి కాగా వార్ 2 కి ఎక్కువ సమయం పట్టింది. లోకేష్ కనగరాజ్, అయాన్ ముఖర్జీలు పరస్పర కాంపిటీషన్ లో ఎలాంటి కంటెంట్ ఇస్తారో చూడాలి. జూన్ నుంచి ప్రమోషన్లు వేగవంతం చేసేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు. పబ్లిసిటీ హోరెత్తిపోవడం ఖాయం.