సంక్రాంతికి వస్తున్నాంలో వెంకటేష్ తో బ్లాక్ బస్టర్ పొంగలూ అంటూ పాట పాడించి సూపర్ సక్సెస్ అయిన భీమ్స్ సిసిరోలియో నెక్స్ట్ మెగా 157 కోసం చిరంజీవితో గానం చేయించబోతున్నాడనే లీక్ ఆసక్తికరంగా ఉంది. నిజానికి మెగాస్టార్ సాంగ్స్ కోసం గొంతు సవరించుకున్న సందర్భాలు రెండే. 1992 మాస్టర్ లో తమ్ముడు అరె తమ్ముడుకి ప్రేక్షకుల నుంచి మంచి అప్లాజ్ వచ్చింది. దేవా కంపోజింగ్ మ్యూజిక్ లవర్స్ కి కనెక్ట్ అయింది. 2001 మృగరాజులో ఛాయ్ తాగరా భాయ్ అంటూ మరోసారి మణిశర్మ పాడించాడు. సాంగ్ హిట్టయ్యింది కానీ అసలు బొమ్మ మాత్రం డిజాస్టర్ తో చేతులెత్తేసింది.
మళ్ళీ రెండున్నర దశాబ్దాల తర్వాత మెగా గొంతుతో పాడించే ప్రయత్నం చేయడం పెద్ద సాహసమే. ఇక్కడ భీమ్స్ మీదున్న అతి పెద్ద బాధ్యత క్యాచీగా వైరలయ్యే రేంజ్ లో ట్యూన్ సిద్ధం చేసుకోవడం. ఎందుకంటే పాట రీచ్ చిరు గాత్రం మీద ఆధారపడదు. అయినా ఈ వయసులో ఏదో మిరకిల్ వినిపిస్తుందని చెప్పడానికి లేదు. సో భారం మొత్తం భీమ్స్ మీదే ఉంటుంది. దాన్ని నిలబెట్టుకోవాలి. ఫ్యాన్స్ చాలా ఎక్కువగా ఆశిస్తారు. వెంకీని మించిన సాంగ్ తమకు కావాలని డిమాండ్ చేస్తారు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే చిరుతో రిహార్సల్స్ చేయించుకోవడం, పర్ఫెక్షన్ కోసం రీ టేకులు అడగడం మరో ప్రహసనం.
ఇంకా రెగ్యులర్ షూటింగ్ మొదలుకాలేదు కానీ మెగా 157 అప్డేట్స్ మాత్రం అనఫీషియల్ గా అయినా సరే మంచి క్రేజీగా ఉంటున్నాయి. భీమ్స్ కనక అనిల్ రావిపూడి తన మీద పెట్టుకున్న నమ్మకాన్ని మరోసారి నిలబెట్టుకోగలిగితే డైరెక్ట్ డబుల్ ప్రమోషన్ వస్తుంది. అగ్ర హీరోలకు తమన్, దేవిశ్రీ ప్రసాద్, అనిరుద్ రవిచందర్ కన్నా ఎక్కువ ఆప్షన్లు లేకుండా పోతున్న ట్రెండ్ లో తెలంగాణ టాలెంట్ భీమ్స్ కు ఇంతకన్నా మంచి టైం దొరకదు. ఏళ్ళ తరబడి బ్రేక్ కోసం ఎదురు చూస్తే 2025లో మొదటిది దక్కింది. వచ్చే ఏడాది అదే సంక్రాంతి టైంలో మరొక్కటి అందుకుంటే భీమ్స్ టాప్ లీగ్ లో చేరిపోవచ్చు.