న్యాచురల్ స్టార్ నాని హీరోగా రూపొందుతున్న హిట్ 3 ది థర్డ్ కేస్ ప్రమోషన్లు మొదలపోయాయి. మే 1 విడుదల కాబట్టి ఇప్పటి నుంచే పబ్లిసిటీ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. స్వంత ప్రొడక్షన్ అందులోనూ చాలా పెద్ద బడ్జెట్, పైగా ఈ ఫ్రాంచైజీలో మొదటిసారి హీరోగా చేస్తుండటంతో నాని ప్రతిదీ దగ్గరుండి చూసుకుంటున్నాడు. అదే రోజు సూర్య రెట్రోతో పోటీ ఉన్న నేపథ్యంలో దాన్ని దృష్టిలో పెట్టుకుని హైప్ విషయంలో ఏమేం కావాలో అన్ని ఇప్పటినుంచే ప్లాన్ చేస్తున్నాడు. ఇదిలా ఉండగా హిట్ 3 కి ఒక కోలీవుడ్ హీరో క్యామియో ఉంటుందనే లీక్ ఒక్కసారిగా అభిమానుల అంచనాలు పెంచేస్తోంది.
దాని ప్రకారం హిట్ 3లో ఖైదీ అలియాస్ ఖాకీ హీరో కార్తీ ఉండొచ్చని ఇన్ సైడ్ టాక్. హిట్ 4 ది ఫోర్త్ కేస్ కి లీడ్ ఇచ్చేలా క్లైమాక్స్ లో ఎంట్రీ ఇప్పించి ఆ తర్వాత శుభం కార్డు వేస్తారని టాక్. గతంలో ఇదే పాత్ర మాస్ మహారాజ రవితేజ చేస్తాడనే టాక్ వచ్చింది. దాదాపు ఖరారే అనుకున్నారు కూడా. కానీ ఏవో కారణాల వల్ల ఇప్పుడా స్థానంలోకి కార్తీ రావొచ్చని అంటున్నారు. నానితో మంచి బాండింగ్ ఉన్న కార్తీ ఒకవేళ చేసినా ఆశ్చర్యం లేదు. కథకు ఉపయోగపడుతుందనుకుంటే ఖచ్చితంగా ఎస్ అంటాడు. అందులోనూ ఊపిరి తర్వాత టాలీవుడ్ స్ట్రెయిట్ మూవీలో కార్తీ అసలు కనిపించనే లేదు.
ఇది అధికారికంగా వచ్చింది కాదు కాబట్టి నిర్ధారణగా చెప్పలేం కానీ నిప్పులేనిదే పొగరాదు తరహాలో ఏదో మ్యాటర్ అయితే ఉంది. కాశ్మీర్ తో పాటు చాలా రిస్కీ లొకేషన్లలో హిట్ 3 షూట్ చేశాడు దర్శకుడు శైలేష్ కొలను. నానిని ఇంతకు ముందు ఎప్పుడూ చూడని వయొలెంట్ పోలీస్ గా చాలా డిఫరెంట్ గా చూపించబోతున్నాడట. సరిపోదా శనివారం తర్వాత కొంచెం గ్యాప్ వచ్చిన నాని ఈసారి కూడా మాస్ నే టార్గెట్ చేయబోతున్నాడు. హిట్ 3 రిలీజయ్యాక ది ప్యారడైజ్ రావడానికి ఇంకో ఏడాది పడుతుంది కాబట్టి న్యాచురల్ స్టార్ ఫ్యాన్స్ దీని మీద గంపెడాశలు పెట్టుకున్నారు. ట్రైలర్ మూడో వారంలో లాంచ్ చేస్తారట.