మ్యాడ్ స్క్వేర్ మెరుపులకు 55 కోట్లు

భారీ బడ్జెట్ తో రూపొందిన సినిమాలు పోటీలో ఉన్నప్పటికీ కంటెంట్ ని నమ్ముకుని బరిలో దిగిన మ్యాడ్ స్క్వేర్ అంచనాలకు మించి పెర్ఫార్మ్ చేయడం ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరుస్తోంది. నిజానికి దీనికి మ్యాడ్ లాగా యునానిమస్ హిట్ టాక్ రాలేదు. బాగుందన్నారు కానీ కామెడీ డోస్ సరిపోలేదనే కామెంట్స్ వినిపించాయి. కానీ యూత్ ని థియేటర్లకు వెళ్లకుండా అవి ఆపలేకపోయాయి. పై పెచ్చు కాంపిటీషన్ లో ఉన్నవి మరీ వీక్ కావడంతో మ్యాడ్ 2కి అడ్డుకట్ట లేకుండా పోయింది. నైజామ్ తో పాటు చాలా ఏరియాల్లో రెండో రోజుకే బ్రేక్ ఈవెన్ దగ్గరగా వెళ్లిపోవడం ఇప్పుడున్న పరిస్థితుల్లో మాములు విషయం కాదు.

నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించిన దాని ప్రకారం మ్యాడ్ స్క్వేర్ మూడు రోజులకు గాను 55 కోట్ల 20 లక్షలు వసూలు చేసింది. ఏ కోణంలో చూసుకున్నా ఇది చాలా పెద్ద మొత్తం. ఎందుకంటే స్టార్ క్యాస్టింగ్ లేకుండా అపోజిషన్ లో మోహన్ లాల్, నితిన్, విక్రమ్ లాంటి స్టార్లను తట్టుకుని ఇంత వసూళ్లు నమోదు చేయడం సెన్సేషనే. నిన్న ప్రధాన కేంద్రాల్లో చాలా మటుకు షోలు హౌస్ ఫుల్ అయిపోయి అదనపు స్క్రీన్లు జోడించాల్సి వచ్చింది. సోమవారం కూడా రంజాన్ సెలవు కావడంతో మరిన్ని పెద్ద నెంబర్లు మ్యాడ్ స్క్వేర్ కు తోడు కాబోతున్నాయి. నిర్మాత నాగవంశీ జోస్యం నిజమవుతోంది.

రేపటి నుంచి ఎంత డ్రాప్ నమోదవుతుందనేది కీలకం కానుంది. రెండో వీకెండ్ లోనూ చెప్పుకోదగ్గ కొత్త రిలీజులు లేవు. ఏప్రిల్ 10 దాకాఇదే పరిస్థితి. దీన్ని కనక మ్యాడ్ స్క్వేర్ సరిగ్గా వాడుకుంటే వంద కోట్ల గ్రాస్ కష్టమేమి కాదు. అలా అని ఈజీ అని చెప్పలేం. రేపటి నుంచి వీకెండ్ హోల్డ్ చేసుకోవడం ముఖ్యం. షోలు పెంచుతున్నారు కాబట్టి మేజిక్ నెంబర్ సాధ్యమే. కళ్యాణ్ శంకర్ దర్శకత్వం వహించిన ఈ ఎంటర్ టైనర్ తర్వాతి భాగం మ్యాడ్ క్యూబ్ ఉండబోతోంది. ఈసారి బ్యాక్ డ్రాప్ ఎలా ఉంటుంది, ఎక్కడికి తీసుకెళ్ళబోతున్నారు లాంటి ప్రశ్నలకు సమాధానం దొరకాలంటే ఇంకొంత కాలం వెయిట్ చేయాలి.