దసరా తేలిపోయింది.. దీపావళి మోగిపోతుంది

సంక్రాంతి తర్వాత తెలుగులో సినిమాల సందడి బాగా ఉండే సీజన్ దసరానే. ఈ దసరా మాత్రం సినీ ప్రియులకు తీవ్ర నిరాశనే మిగిల్చింది. ఓవైపు థియేటర్లు మూతపడి ఉండగా.. మరోవైపు ఓటీటీల్లో సైతం సరైన సినిమాలు రాలేదు. ఒక్క ‘కలర్ ఫోటో’ మాత్రమే విడుదలైంది. అది పండుగ మూడ్‌ను పెంచే సినిమా అయితే కాదు. ఇది కాకుండా వేరే సినిమాలేవీ విడుదల కాలేదు.

ఐతే దసరా తేలిపోయినప్పటికీ దీపావళికి మాత్రం కచ్చితంగా సినిమాల సందడి చూడబోతున్నట్లే. ఆ సమయానికి థియేటర్లు 100 శాతం ఆక్యుపెన్సీతో నడవొచ్చనే అంచనాలున్నాయి. కాబట్టి కొత్త సినిమాలేవైనా అప్పటికి విడుదలవుతాయేమో చూడాలి. దాని మీద ఆశలు తక్కువే కానీ.. ఆ టైంకి ఓటీటీలు మాత్రం కొత్త సినిమాలతో కళకళలాడబోతున్నాయి.

దీపావళి ముందు వారమే ‘ఆహా’లో ‘మా వింత గాథ వినుమా’ రిలీజ్ కానుంది. ‘కృష్ణ అండ్ హిజ్ లీల’ తర్వాత సిద్ధు జొన్నలగడ్డ, సీరత్ కపూర్ జంటగా నటించిన సినిమా కావడంతో దీనిపై మంచి అంచనాలే ఉన్నాయి. దీంతో పాటే కీర్తి సురేష్ సినిమా ‘మిస్ ఇండియా’ నెట్‌ఫ్లిక్స్‌లో నవంబరు 4నే విడుదల కానుంది. మరోవైపు సాయిధరమ్ తేజ్ సినిమా ‘సోలో బ్రతుకే సో బెటర్’ను జీ 5లో దీపావళి రోజునే స్ట్రీమ్ చేయబోతున్నారు. అంతకంటే ముందు అక్షయ్ కుమార్ హిందీ సినిమా ‘లక్ష్మీబాంబ్’ నవంబరు 9 నుంచే హాట్ స్టార్‌లో ప్రసారం కానుంది.

ఈ సినిమాలన్నింటికీ మించి దీపావళిని సందడిని పెంచే చిత్రం ‘ఆకాశం నీ హద్దురా’. సౌత్ ఇండియాలో ఓటీటీ సినిమాల్లో బిగ్గెస్ట్ అంటే ఇదే. సూర్య హీరోగా నటించిన ఈ చిత్రం నవంబరు 12న అమేజాన్ ప్రైమ్‌లో విడుదల కానుంది. ఈ చిత్రం తెలుగు, తమిళ భాషల్లో రాబోతోంది. దాంతో పాటే విశాల్ నటించిన ‘చక్ర’ సైతం తమిళ, తెలుగు భాషల్లో దీపావళికే రాబోతోంది. ఇలా అరడజను కొత్త సినిమాలతో దీపావళికి సందడి నెలకొనబోతోంది.