విజయ్ దేవరకొండ అన్నయ్యగా సత్యదేవ్ ?

రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ కెరీర్ లో అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ప్యాన్ ఇండియా మూవీ కింగ్ డమ్ షూటింగ్ చివరి దశకు వస్తోంది. దర్శకుడు గౌతమ్ తిన్ననూరి దీన్ని తీర్చిదిద్దిన విధానం గురించి యూనిట్ చెబుతున్న లీకులు అంచనాలను అమాంతం పెంచేస్తున్నాయి. అవేంటనేది రిలీజ్ దగ్గర్లో ఉన్నప్పుడు చూసుకోవచ్చు కానీ ఒక ముఖ్యమైన అప్డేట్ ఆసక్తి రేపేలా ఉంది. ఇందులో సత్యదేవ్ ఓ కీలక పాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. ఇన్ సైడ్ టాక్ ప్రకారం తను విజయ్ దేవరకొండకు అన్నయ్యగా నటించాడట. శ్రీలంక తెగలో నాయకుడిగా ఆ క్యారెక్టర్ పవర్ ఫుల్ గా ఉంటుందని సమాచారం.

సత్యదేవ్ మీద నడిచే ట్విస్టు ద్వారా విజయ్ దేవరకొండ ఆ సామ్రాజ్యానికి రావడమనే ఎపిసోడ్ చాలా హై ఇంటెన్స్ తో ఉంటుందని అంటున్నారు. టీజర్ లో చూపించిన విజువల్స్ లో తనవాళ్లు విలన్ల రక్తదాహానికి బలైతే మిగిలిన తెగను కాపాడేందుకు వచ్చిన లీడర్ గా విజయ్ ఇంటెన్స్ వేరియేషన్స్ చూపించడం గమనించాం. ఒక భాగమా లేక రెండు భాగాలు ఉంటుందానేది నిర్మాణ సంస్థ సితార ఇంకా రివీల్ చేయలేదు. గతంలో నాగవంశీ చెప్పిన ప్రకారం సీక్వెల్ వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంది. ప్రస్తుతం హైదరాబాద్ షెడ్యూల్ కి షిఫ్ట్ అయిపోయిన కింగ్ డంకు అనిరుద్ రవిచందర్ సంగీతం సమకూరుస్తున్నాడు.

మే 30 విడుదల కాబోతున్న కింగ్ డమ్ ప్రమోషన్లు వచ్చే నెల నుంచి ప్రారంభం కాబోతున్నాయి. ఎట్టి పరిస్థితుల్లో వాయిదా లేకుండా అన్ని ప్లానింగ్ ప్రకారం జరిగిపోతున్నాయి. భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటిస్తున్న ఈ హిస్టారికల్ డ్రామాలో శ్రీలంక ఎపిసోడ్లు టెర్రిఫిక్ గా వచ్చాయట. కంటెంట్ పరంగా తమిళనాడు ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అయ్యే కాన్సెప్ట్ కావడంతో కోలీవుడ్ పబ్లిసిటీ మీద ప్రత్యేక దృష్టి పెట్టబోతున్నారు. ట్రైలర్ లాంఛ్ ఎప్పుడు చేయాలనేది ఇంకా నిర్ణయం తీసుకోలేదు. దీని వర్క్ అంతా అయ్యాక గౌతమ్ తిన్ననూరి బ్యాలన్స్ ఉన్న మరో సినిమా మేజిక్ పోస్ట్ ప్రొడక్షన్ వైపు దృష్టి పెట్టనున్నాడు.