అంతా ఫేక్ అంటే.. సోనూ సూద్ ఏమన్నాడంటే?

కరోనా వల్ల తలెత్తిన లాక్ డౌన్ దెబ్బకు జనం అల్లాడిపోతున్న సమయంలో ఎంతోమందిని ఆదుకుని రియల్ హీరోగా అవతరించాడు రీల్ విలన్ సోనూ సూద్. ముఖ్యంగా దయనీయ స్థితిలో ఉన్న వేలాది మంది వలస కార్మికులను స్వస్థలాలకు చేర్చడానికి సోనూ చేసిన ప్రయత్నాన్ని ఎంత పొగిడినా తక్కువే. అంత‌టితో ఆగ‌కుండా లాక్ డౌన్ వేళ అవస్థలు పడుతున్నట్లు తన దృష్టికి వచ్చిన వాళ్లందరికీ సాయపడుతున్న సంగ‌తి తెలిసిందే.

సోష‌ల్ మీడియా ద్వారా వంద‌ల‌మంది సోనూకు త‌మ క‌ష్టం చెప్పుకుని సాయం పొందడాన్ని చూస్తూనే ఉన్నాం. ఐతే దీని వెనుక ఏదో మోసం ఉందంటూ కొన్ని రోజుల కిందట ట్విట్టర్ జనాలు సందేహాలు వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. సోనూ నుంచి సాయం పొందిన అనంత‌రం ట్విట్టర్ అకౌంట్లు మాయమయ్యాయని.. ఇదంతా సోనూ ఇమేజ్ పెంచడానికి జరుగుతున్న ఫేక్ ప్రచారం అంటూ కొందరు ఆరోపించారు.

ఐతే ఈ ఆరోపణలపై సోనూ వివరంగా స్పందించలేదు కానీ.. తేలిగ్గా కొట్టిపారేశాడు. ఏం మంచి చేసినా దాన్ని అనుమానపు చూపులతో చూసే వాళ్లు ఎక్కడైనా ఉంటారంటూ విషయాన్ని తేలికపరిచే ప్రయత్నం చేశాడు. కాగా తాజాగా సోనూ వైద్య సాయం అడిగిన ఒక వ్యక్తికి హామీ ఇస్తూ సర్జరీ చేయిస్తానంటూ ట్వీట్ పెట్టగా.. దాని మీద ఒక నెటిజన్ వ్యంగ్యంగా స్పందించాడు. ‘‘కొత్త ట్విటర్ అకౌంట్. ఇద్దరు ముగ్గురు ఫాలోవర్లు. తన వైద్యానికి సహాయం చేయలంటూ ఒకే ఒక ట్వీట్. కనీసం సోనూను ట్యాగ్ చేయలేదు. లొకేషన్ చెప్పలేదు. కాంటాక్ట్ డిటైల్స్, ఈ మెయిల్ అడ్రస్ ఇవ్వలేదు. అయినా ఆ ట్వీట్‌కు సోనూ రిప్లై ఇచ్చాడు. ఇదెలా సాధ్యమో తెలియడం లేదు. అలాగే సహాయం కోరుతూ గతంలో చాలా ట్విటర్ హాండిల్స్ నుంచి వచ్చిన ట్వీట్లు ఇప్పుడు డిలీట్ అయిపోయాయి’’ అని పేర్కొన్నాడు.

దీనికి సోనూ వెంటనే రిప్లై ఇచ్చాడు. ‘‘అదే గొప్ప విషయం బ్రదర్. ఇబ్బందుల్లో ఉన్న వారిని నేను గుర్తిస్తా. వాళ్లు నన్ను ఆశ్రయిస్తారు. అది చిత్తశుద్ధికి సంబంధించినది. అలాంటివి నీకు అర్థం కావు. రేపు ఆ వ్యక్తి ఎస్ఆర్‌సీసీ హాస్పిటల్‌లో ఉంటాడు. నీకు సాయం చేయాలనిపిస్తే అతడికి కొన్ని పండ్లు పంపించు. ఇద్దరు ముగ్గురు ఫాలోవర్లున్న వ్యక్తికి నీలా ఎక్కువమంది ఫాలోవర్లున్న వ్యక్తి ప్రేమను పంచితే సంతోషిస్తాడు’’ అంటూ ఆ వ్యక్తికి కౌంటర్ ఇచ్చాడు సోనూ. తనపై ఆరోపణలు చేసే అందరికీ సోనూ ఈ ట్వీట్‌తో ఘాటుగా బదులిచ్చినట్లే ఉన్నాడు.