భారీ చిత్రం… సినిమాటోగ్రాఫర్‌తోనే అసలు సమస్య?

అతనొక నిర్మాత కొడుకు. దర్శకుడు కావాలన్నది అతడికల. ఎన్నో ప్రయత్నాలు చేశాడు. ఒక సినిమా అనౌన్స్ అయి కూడా ఆగిపోయింది. ఇంకో రెండు మూడు సినిమాలు ఓకే అయినట్లే ఓకే అయిన వెనక్కి వెళ్లాయి. చివరికి ఒక హీరో కమ్ ప్రొడ్యూసర్ అతణ్నినమ్మి అవకాశం ఇచ్చాడు. తొలి చిత్రానికే కొంచెం పెద్ద బడ్జెట్ కూడా ఇచ్చాడు. సోషియో ఫాంటసీ టచ్ ఉన్న ఆ సినిమాను దర్శకుడు బాగా డీల్ చేశాడు. సినిమా పెద్ద హిట్ అయింది. దీంతో అతడి రెండో చిత్రానికి బాగా డిమాండ్ ఏర్పడింది. ఒక లెజెండరీ హీరో తనతో సినిమా చేయడానికి ముందుకు వచ్చాడు. మరో సోషియో ఫాంటసీ కథనే దర్శకుడు రెడీ చేయగా.. భారీ స్కేల్‌లో సినిమా చేయడానికి పేరున్న నిర్మాతలు ముందుకు వచ్చారు. సినిమా అనౌన్స్ చేసినపుడే అదిరిపోయే బజ్ వచ్చింది.

ఇది చరిత్ర సృష్టించే సినిమా అవుతుందన్న అంచనాలు ఏర్పడ్డాయి. ఇక ఈ మూవీ టీజర్ రాబోతుంటే హైప్ మామూలుగా లేదు.కానీ టీజర్ రిలీజైందో లేదో.. మొత్తం కథ మారిపోయింది. ఆ టీజర్లో విజువల్స్, విజువల్ ఎఫెక్ట్స్ చూసి అభిమానులకు దిమ్మదిరిగిపోయింది. కొన్ని రోజులకే సోషల్ మీడియాలో ఇదొక ట్రోల్ మెటీరియల్‌గా మారిపోయింది. సినిమాకు ఉన్న బజ్ అంతా తగ్గిపోయింది. నెగెటివిటీ ముసురుకుంది. దీంతో సినిమాను వాయిదా వేసి.. మళ్లీ విజువల్ ఎఫెక్ట్స్ మీద కొన్ని నెలలుగా వర్క్ చేస్తున్నారు.

పేరున్న వీఎఫెక్స్ సంస్థలను హైర్ చేసుకుని బెస్ట్ ఔట్ పుట్ తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ ఎంతకీ ఆ పని ఒక కొలిక్కి రావడం లేదు. షూటింగ్ పూర్తయినా సరే.. రిలీజ్ సంగతి తేలడం లేదు. ఇంతకీ సమస్య ఏంటా అని ఆరా తీస్తే.. సినిమాటోగ్రఫీ వల్ల చిక్కు ముడి ఏర్పడిందట. వీఎఫెక్స్‌లో ఎంత క్వాలిటీ పెంచినా.. ఔట్ పుట్ మార్చినా.. దానికి సినిమా విజువల్స్‌కు అస్సలు మ్యాచ్ కావడం లేదట. సదరు సినిమాటోగ్రాఫర్ బాగా సీనియరే అయినా.. ఇప్పుడున్న టెక్నాలజీకి తగ్గట్లు, అడ్వాన్స్డ్ విజువల్స్ ఇవ్వలేకపోయాడని.. దీంతో ఆయన విజువల్స్, కొత్తగా వర్క్ చేసిన వీఎఫెక్స్ సింక్ కావట్లేదని.. ఇక్కడే ఔట్ పుట్ తేడా కొడుతోందని చిత్ర వర్గాల సమాచారం. తన తొలి చిత్రానికి పని చేసిన కెమెరామన్‌నే ఏరి కోరి ఈ భారీ చిత్రానికి కూడా పెట్టుకున్న దర్శకుడు ఇప్పుడు తన పనితనం కుదరక ఇబ్బంది పడుతున్నట్లు సమాచారం. మరి ఈ సమస్యకు పరిష్కారమేంటో చూడాలి.