సినీ కుటుంబాల నుంచి హీరోలయ్యే కుర్రాళ్లు ఒక పట్టాన ఓటమిని ఒప్పుకోరు. వరుసగా సినిమాలు ఫెయిలవుతున్నా, ప్రేక్షకుల ఆమోదం పొందకపోయినా.. తమ ప్రయాణాన్ని ఆపరు. చిన్నవైనా సరే సినిమాలు చేస్తూనే ఉంటారు. ఎప్పుడో ఒకప్పుడు హిట్టు కొట్టకపోతానా, హీరోగా సక్సెస్ కాకపోతానా అన్న ఆశతో ఇండస్ట్రీని వదిలిపెట్టరు. నందమూరి తారకరత్న ఇందుకు ఒక ఉదాహరణ. అతడి స్థాయిలో కాకపోయినా హీరో వేషాలు వదలకుండా సినిమాలు చేస్తున్న వారసులు వివిధ భాషల్లో చాలామందే ఉన్నారు.
ఐతే టాలీవుడ్‌కు చెందిన ఒక వారసుడు మాత్రం నటుడిగా, హీరోగా తాను సెట్ అవ్వనని చాలా త్వరగానే తెలుసుకున్నట్లున్నాడు. హీరో వేషాలు వదిలేసి చక్కగా ప్రొడక్షన్ వ్యవహారాలపై దృష్టిపెట్టాలని అతను ఫిక్సయిపోయాడు. అతనే.. నవీన్ విజయకృష్ణ. సీనియర్ నటుడు నరేష్ తనయుడే ఈ కుర్రాడు.
నవీన్ హీరోగా పరిచయమైన ‘నందిని నర్సింగ్ హోమ్’ పర్వాలేదనిపించింది కానీ.. అతడికి ఆశించిన ఫలితాన్నివ్వలేదు. దీని కంటే ముందే అతను ‘ఐనా ఇష్టం నువ్వు’ అనే సినిమా చేశాడు. కీర్తి సురేష్ తెలుగు తెరకు పరిచయం కావాల్సిన సినిమా ఇదే. కానీ ఆ సినిమా విడుదలకే నోచుకోలేదు. ఇక నవీన్ మూడో సినిమా గత ఏడాది విడుదలైన సంగతి కూడా చాలామందికి తెలియదు. అదే.. ఊరంతా అనుకుంటున్నారు. ఈ సినిమాకు కనీస స్పందన కరవవడంతో నవీన్ హీరోగా కొనసాగే విషయంలో పునరాలోచనలో పడిపోయారు. అతడి లుక్స్, యాక్టింగ్ మీద సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరిగింది. దీంతో పూర్తిగా హీరోగా కొనసాగడంపై ఆశలు వదులుకున్నట్లున్నాడు.
తాజాగా నవీన్, నరేష్ కలిసి ‘విజయకృష్ణ’ పేరుతో ఒక స్టూడియో మొదలుపెట్టారు. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలకు అనువుగా ఏర్పాటైన స్టూడియో ఇది. నవీన్ హీరో కావడానికి ముందు ఎడిటర్. అందులో అతడికి బాగానే నైపుణ్యం ఉంది. మిగతా పోస్ట్ ప్రొడక్షన్ వ్యవహారాల మీద కూడా అతడికి పట్టుంది. కాబట్టి ఈ స్టూడియో మీదే ఫోకస్ పెడదామని ఫిక్సయినట్లున్నాడు. ఈ స్టూడియో ప్రారంభోత్సవం సందర్భంగా నవీన్ అవతారం చూస్తే అతను నటన మీద పూర్తిగా ఆశలు వదులుకున్నాడని స్పష్టమవుతోంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates