బాలు గారు పోయి నెల కావొస్తుంది.. ఇంకా చాలా మంది ఎదో తెలియని దిగులుతో వున్నారు.. కానీ దానిలో నుచి బయటకు రావటానికి మార్గం తెలుసుకోవాలి… ఇప్పుడు అందరికి మనోబలాన్ని పెంచి.. మనోధైర్యం ఇవ్వగలిగిన వ్యక్తి ఒక్కడే వున్నాడు.. అతడే నాగూర్ బాబు… కానీ ఇతను బాలుగారికి ఆపద్ధర్మ ప్రత్యామ్నాయం మాత్రం కాదు.. బాలుగారే తన వారసుడిగా ప్రకటించిన వ్యక్తి..
బాలు గారికి వున్న అన్ని లక్షణాలు పుష్కలంగా వున్నవాడు. సింగింగ్ టాలెంట్.. హాస్యచతురత.. మనుషుల పట్ల చూపే మమకారం.. మిగతా అన్ని విషయాల్లోనూ బాలు గారితో సరి తూగగలిగిన వ్యక్తి నాగూర్ బాబు. ఇప్పుడు ఇద్దరికీ సంబంధించిన కొన్ని విషయాలు.. బాలుగారి తండ్రి హరికథలు చెప్పేవారు.. నాగూర్ బాబు తండ్రి హార్మోనియం వాయించేవారు. నాగూర్ బాబు తల్లి గారు తెలుగు పౌరాణిక నాకాకాల్లో ఆమె పద్యం ఆమే పాడుకుని నటించేవారు. బాలనాగమ్మ నాటకం లో షాహిదా సంగు వేషం వేస్తుందంటే జనం విరగబడేవారు. బాలుగారు ఆటిమొబైల్ ఇంజనీరింగ్ చదివి మద్రాస్ వస్తే.. నాగూర్ జీవితాన్ని ఆంద్ర నాటక రంగాన్ని చదివి మద్రాస్ చేరుకున్నాడు.
బాలు గారిని మ్యూజిక్ డైరెక్టర్ కోదండపాణి ప్రోత్సహిస్తే.. నాగూర్ ని మ్యూజిక్ డైరక్టర్ చక్రవర్తి తనదగ్గర అసిస్టెంట్ గా ఉంచుకుని అప్పుడప్పుడు పాడే అవకాశం కల్పించి బయట పాటలు కూడా పాడుకునే లా చేశారు. బాలు లో వున్న లౌక్యం సమయస్పూర్తి మిమిక్రీ టాలెంట్ నాగూర్ లో కూడా వున్నాయి. ఒకే ఇంట్లో పుట్టకపోయిన, ఒకే ఊరిలో పుట్టకపోయినా, ఒకే మతంలో పుట్టకపోయినా ఒకేసారి పుట్టకపోయినా తెలుగు తల్లి కి పుట్టిన ఇద్దరు కవలలు…బాలు నాగూర్.
తెలుగు తమిళ్ కన్నడ మలయాళ హిందీ లో 40 వేలకు పైగా పాటలు ఆయన పాడితే అన్ని భాషలు కలిపి నాగూర్ 25వేల పాటలు పాడాడు. టీవీ రియాలిటీ షోలలో బాలుగారు ఆకట్టుకున్నంత గా నాగూర్ బాబు కూడా చూసేవాళ్లను అలరిస్తాడు. బాలు కమల్ కి గాత్రదానం చెస్తే.. నాగూర్ రజనీ కి గాత్రదానం చేస్తున్నాడు. నా సినీ చైల్డ్ హుడ్ ఫ్రెండ్.. నాకు అత్యంత ఆత్మీయదు.. నా మనీ సినిమా లో భద్రం బీ కెర్ ఫుల్ బ్రదరూ పాటతో మొదలు దాదాపు నా సినిమాలన్నింటి లోను పాడిన మా నాగూర్ బాబు (మనో) కి జన్మదిన శుభాకాంక్షలు.
— శివ నాగేశ్వర రావు