కొన్నిసార్లు లైఫ్ లో తీసుకునే కీలకమైన నిర్ణయాలు ఏ మలుపుకు తీసుకెళ్తాయో ఊహించడం కష్టం. కాకపోతే చిత్తశుద్ధి ఉంటే కోరుకున్న ఎత్తులను చేరుకోవచ్చు. అందుకు తమన్ ని ఉదాహరణగా తీసుకోవాలి. తాజాగా విడుదలైన శబ్దం ప్రమోషన్ల సందర్భంగా తను చెప్పిన ఒక ముచ్చట వింటే పైన చెప్పిన స్టేట్ మెంట్ ఎంత నిజమో అర్థమవుతుంది. 2003 శంకర్ దర్శకత్వంలో వచ్చిన బాయ్స్ లో నటించిన తమన్ కు అందులో యాక్టర్ గానూ మంచి పేరు వచ్చింది. బొద్దుగా అమాయకత్వంతో నిండిన పాత్రలో కామెడీ, ఎమోషన్స్ బాగానే పండించాడు. బాయ్స్ లో నటించినవాళ్ళలో ఎక్కువ పారితోషికం ఇచ్చింది తమన్ కే.
తర్వాత నటుడిగా తమన్ కు ఆఫర్లు క్యూ కట్టాయి. అజిత్, విజయ్, లింగుస్వామి, సెల్వ రాఘవన్ ఇలా ఎందరో హీరోలు, దర్శకులు అవకాశాలు ఇస్తామని ఫోన్లు చేశారు. కానీ తమన్ సంకల్పం ఒకటే. పాతికేళ్ళు వచ్చేలోగా తనో మ్యూజిక్ కంపోజర్ అయిపోవాలి. దీంతో మనసుకు కష్టం అనిపించినా సరే ఆ ఛాన్సులన్నీ వదులుకున్నాడు. కట్ చేస్తే రెండు దశాబ్దాల పాటు మోస్ట్ వాంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకుని ఆ ప్రస్థానాన్ని ఇంకా కొనసాగిస్తూనే ఉన్నాడు. ఎవరైతే ఆఫర్లు ఇచ్చారో వాళ్లందరికీ మర్చిపోలేని గొప్ప ఆల్బమ్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్లతో ఎన్నో బ్లాక్ బస్టర్లలో భాగం పంచుకున్నాడు.
ఒకవేళ ఇలా కాకుండా నటుడిగా ఎస్ చెప్పి ఉంటే మహా అయితే కామెడీ లేదా సపోర్టింగ్ ఆర్టిస్టుగా సెటిలైపోయేవాడు తప్పించి ఇంత గొప్ప ప్రతిభ ప్రపంచానికి అందకుండా పోయేది. గతంలో రైటర్లుగా గొప్ప ఫామ్ లో ఉన్న టైంలో తనికెళ్ళ భరణి, ఎల్బి శ్రీరామ్ లు పెన్ను వదిలేసి మేకప్ వేసుకోవడానికి ప్రాధాన్యం ఇవ్వడం ఇద్దరు రచయితలను మనకు మిస్ చేసింది. అఫ్కోర్స్ వాళ్ళు నటనలో రాణించడం వేరే సంగతి. ఏదైతేనేం తమన్ తీసుకున్న డెసిషన్ వల్ల సంగీత ప్రియులకు సంతోషం మిగిలింది. కొత్త ఏడాది రెండు నెలల్లోనే తమన్ మూడు సినిమాలు గేమ్ ఛేంజర్, డాకు మహారాజ్, శబ్దం వచ్చేశాయి.