సినిమా చూపిస్త మావ, నేను లోకల్, హలో గురూ ప్రేమ కోసమే, ధమాకా చిత్రాలతో వరుస హిట్లు కొట్టిన దర్శకుడు త్రినాథరావు నక్కిన. ఆయన్నుంచి రాబోతున్న కొత్త చిత్రం.. మజాకా. ఈ సినిమా టీజర్ లాంచ్ కార్యక్రమంలో త్రినాథరావు చేసిన వ్యాఖ్యల మీద పెద్ద దుమారమే రేగింది. ఈ చిత్రంతోనే టాలీవుడ్లోకి రీఎంట్రీ ఇచ్చిన మన్మథుడు హీరోయిన్ అన్షును ఉద్దేశించి మాట్లాడుతూ.. కొంచెం బరువు పెరగాలని, సైజులు పెంచాలని.. లేకుంటే తెలుగు ప్రేక్షకులు ఒప్పుకోరని త్రినాథ రావు చేసిన కామెంట్ వివాదానికి దారి తీసింది. దీని మీద సోషల్ మీడియాలో తీవ్ర వ్యతిరేకత రావడంతో త్రినాథరావు తన వ్యాఖ్యలపై క్షమాపణ చెబుతూ ఒక వీడియో రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే.
తాజాగా తన వ్యాఖ్యలపై త్రినాతరావు మరోసారి స్పందించాడు. తాను ఉద్దేశవపూర్వకంగా ఆ వ్యాఖ్యలు చేయలేదని.. తెలియక జరిగిన తప్పు అదని ఆయన వ్యాఖ్యానించాడు. ఈ వివాదం తన కుటుంబాన్ని ఎంతో బాధ పెట్టినట్లు త్రినాథరావు వెల్లడించాడు. ”నేను కావాలని ఆ కామెంట్స్ చేయలేదు. అక్కడున్న మీడియా వాళ్లను నవ్వించాలని అలా మాట్లాడా. కావాలని చేస్తే అది తప్పు అవుతుంది. తప్పు చేసినపుడు ఏ శిక్షకైనా సిద్ధమే. తర్వాత ఆలోచిస్తే నేను మాట్లాడింది కరెక్ట్ కాదు కదా అని నాకే అనిపించింది. అందుకే సారీ చెబుతూ వీడియో రిలీజ్ చేశాను.
నిజానికి నేనేం మాట్లాడానో అన్షుకు అర్థం కాలేదు. దీని మీద వివాదం చెలరేగడంతో ఏం జరిగిందో ఫోన్ చేసి అడిగి తెలుసుకుంది. విషయం మొత్తం తనకు వివరించా. ఆమె అర్థం చేసుకుంది. ఈ గొడవ వల్ల మా అమ్మ బాగా డిస్టర్బ్ అయింది. ఒక్క మాటతో మంచి పేరు చెడిందని ఆవేదన చెందింది. ఇన్నాళ్లు కష్టపడి మంచి పేరు తెచ్చుకున్నావు, ఎందుకు నాన్నా నోరు జారావు అని అడిగింది. ఇకపై జాగ్రత్తగా ఉండమని చెప్పింది. ఆమె వారం రోజుల పాటు దీని గురించి బాధ పడుతూనే ఉంది. ఆమె ఏమైపోతుందో అని నేను టెన్షన్ పడ్డా. ఇకపై మరింత జాగ్రత్తగా ఉండాలని నిర్ణయించుకున్నా” అని త్రినాథరావు వివరించాడు.
Gulte Telugu Telugu Political and Movie News Updates