కొందరు హీరోయిన్లు కెరీర్ ఆరంభంలో చేసే పాత్రలను బట్టి వారి మీద ఒక ట్రెడిషనల్ ముద్ర పడిపోతుంది. దీంతో ఆ తర్వాత కూడా అలాంటి పాత్రలే వస్తాయి. గ్లామర్ పాత్రలు అనగానే వీళ్లు చేయరనే అభిప్రాయం బలంగా ఉంటుంది. ముఖ్యంగా తెలుగమ్మాయిల విషయంలో ఈ ముద్ర పడడం ఎక్కువ. తన మీదా అలాంటి అభిప్రాయం ఉండిపోయిందని.. తాను చేయనేమో అనుకుని ముద్దు సీన్లు ఉన్న సినిమాలేవీ తనకు ఆఫర్ చేయట్లేదని ఓ ఇంటర్వ్యూలో రీతూ వర్మ వ్యాఖ్యానించింది.
కథ డిమాండ్ చేస్తే అలాంటి పాత్రలు చేయడానికి తనకు అభ్యంతరం లేదని రీతూ చెప్పడం విశేషం. ‘‘ముద్దు సీన్లు ఉన్న సినిమాల్లో నాకు అవకాశాలు రావడం లేదు. కానీ కథకు అవసరం అనుకుంటే అలాంటి సీన్లు చేయడానికి నాకు ఇబ్బందేమీ లేదు. ఈ అమ్మాయి ఇలాంటి పాత్రలు చేయదు అని కొందరు ఒక నిర్ణయానికి వచ్చేశారు. ఆ కారణంతోనే నా దగ్గరికి అలాంటి కథలు రావడం లేదనుకుంటా’’ అని రీతూ పేర్కొంది.
ఇక గత ఏడాది తమ టీం అంతా ఎన్నో ఆశలు పెట్టుకున్న ‘స్వాగ్’ సినిమా అనుకున్నంతగా ఆడకపోవడం గురించి రీతూ స్పందిస్తూ.. ‘‘మేం ఆ సినిమా చేసేటపుడే అది అందరికీ నచ్చే సినిమా కాదని అనుకున్నాం. ఒక వర్గమే దీనికి కనెక్ట్ అవుతుందనుకున్నాం. ఆ కథలోని డెప్త్ చాలామందికి అర్థం కాలేదు. కానీ ఆ విషయంలో బాధ లేదు. నేను చేసి స్పెషల్ మూవీస్‌లో ‘స్వాగ్’ ఒకటి. అలాంటి కథలో నటించినందుకు సంతృప్తిగా ఉంది. నటిగా నాకు అది స్పెషల్’’ అని చెప్పింది.
తన కెరీర్‌ను మలుపు తిప్పిన ‘పెళ్ళిచూపులు’ చిత్రానికి తరుణ్ భాస్కర్ సీక్వెల్ తీయాలనుకుని తనను అడిగితే తప్పకుండా నటిస్తానని రీతూ చెప్పింది. ‘‘పెళ్లిచూపులు మా స్నేహితులందరం కలిసి చిన్న బడ్జెట్లో చేసిన సినిమా. అది మా అందరి జీవితాలను మలుపు తిప్పింది. విజయ్ పెద్ద స్టార్ అయ్యాడు. అతను ఆ స్థాయికి వెళ్తాడనుకోలేదు. కానీ తనకు మాత్రం ఆ కాన్ఫిడెన్స్ ఉండేది. తనను చూస్తే గర్వంగా అనిపిస్తుంది. ‘పెళ్ళిచూపులు-2’ మేమిద్దరం చేయాలని ప్రేక్షకులు డిమాండ్ చేస్తే తప్పకుండా నటిస్తాం’’ అని రీతూ తెలిపింది.
Gulte Telugu Telugu Political and Movie News Updates