పవన్ కళ్యాణ్ చేయాల్సిన మూడు సినిమాల్లో ఎక్కువ బజ్ ఉన్నది ఓజి అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అంతకన్నా పెద్ద బడ్జెట్ తో హరిహర వీరమల్లు రూపొందినప్పటికీ ప్రమోషన్లు ఊపందుకోని కారణంగా ఇంకా ఆశించిన స్థాయిలో హైప్ ఏర్పడటం లేదు. వీటితో పాటు ఉస్తాద్ భగత్ సింగ్ లైన్ లో ఉంది.
ప్రాధాన్యం పరంగా ఇది చివరిలో జరిగే షూటింగ్ అయినప్పటికీ దర్శకుడు హరీష్ శంకర్ ఆశలన్నీ దీని మీదే ఉన్నాయి. మిస్టర్ బచ్చన్ ఇచ్చిన షాక్ నుంచి కోలుకుని మళ్ళీ కంబ్యాక్ నిరూపించుకోవడానికి ఇంత కన్నా మంచి అవకాశం ఉండదు. తర్వాతి లిస్టులో పెద్దా హీరోలున్నా ఉస్తాద్ సక్సెస్ చాలా కీలకం.
ఇదిలా ఉండగా నిన్న జరిగిన ప్రదీప్ రంగనాధన్ రిటర్న్ అఫ్ ది డ్రాగన్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో హరీష్ శంకర్ ఒక కీలక లీక్ పంచుకున్నారు. ఎన్నికలకు ముందు వైసిపి అధికారంలో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ ఓపెన్ టాప్ జీపు మీద కూర్చుని ప్రయాణం చేస్తుండగా వెనుకా ముందు వేల అభిమానులు వివిధ వాహనాల్లో ఫాలో అవుతున్న వీడియో విపరీతంగా వైరలయ్యింది.
రూలింగ్ పార్టీ ఎన్ని అడ్డంకులు ఏర్పరిచినా పవన్ దూసుకెళ్లిన వైనం జాతీయ మీడియాలోనూ వచ్చింది. అలాంటి ఎపిసోడ్ ఒకటి ఉస్తాద్ భగత్ సింగ్ లో ఉంటుందని వేదిక సాక్షిగా హరీష్ అఫీషియల్ గా లీక్ ఇచ్చేశారు.
వినడానికి సూపర్ ఎగ్జైటింగ్ గా ఉంది కానీ తేరికి కీలక మార్పులు చేసి తీస్తున్న ఈ రీమేక్ లో అలాంటి ఘట్టానికి ఎక్కడ స్కోప్ ఉంటుందన్నది ఆసక్తికరం. అయినా మార్పులు చేయడంలో హరీష్ స్టైల్ వేరు. బచ్చన్ తేడా కొట్టినా అంతకు ముందు గబ్బర్ సింగ్, గద్దలకొండ గణేష్ లో ఒరిజినల్ వెర్షన్ లో లేని ఎన్నో సీన్లు పెట్టి వాటి స్థాయిని పెంచారు.
పవన్ అంటే విపరీతమైన అభిమానం చూపించే హరీష్ శంకర్ ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ లోనూ దాన్ని ఓ రేంజ్ లో ప్రదర్శించే ఉంటారు. కాకపోతే ఎప్పుడు పూర్తవుతుంది, వచ్చే ఏడాది ఎప్పుడు రిలీజవుతుందన్నది సమాధానం సులభంగా దొరకని భేతాళ ప్రశ్న.