ఐశ్వర్య రాజేష్‌ను వేధించిన ‘ఎక్స్’

ట్రెడిషనల్ హీరోయిన్‌గా ముద్ర పడ్డ ఐశ్వర్యా రాజేష్ లాంటి హీరోయిన్ల గురించి ఎఫైర్ రూమర్లు రావడం అరుదు. ఐశ్వర్య ఫలానా వ్యక్తిలో ప్రేమలో ఉందని కానీ.. 35 ఏళ్ల వయసు వచ్చినా.. పదేళ్లకు పైగా ఇండస్ట్రీలో కొనసాగుతున్నా.. తన వ్యక్తిగత జీవితం గురించి ఎప్పుడూ పెద్దగా వార్తలు వచ్చింది లేదు. ఐతే ఇప్పుడు ఐశ్వర్యనే స్వయంగా తన ఒకప్పటి రిలేషన్‌షిప్ గురించి మాట్లాడి ఆశ్చర్యపరిచింది.

తన మాజీ పార్ట్‌నర్ తనను వేధించిన విషయాన్ని ఆమె వెల్లడించింది. కెరీర్ ఆరంభంలో తాను ఒక వ్యక్తితో ప్రేమలో పడ్డట్లు ఆమె తెలిపింది. కానీ ఆ బంధం ఎక్కువ కాలం నిలబడలేదంది.

‘‘లవ్ బ్రేకప్ అయినపుడు వచ్చే బాధ అంటే నాకు చాలా భయం. నేను చాలా ఎమోషనల్. ప్రేమించే సమయం కంటే ప్రేమ లోంచి బయటికి వచ్చేందుకు నేను ఎక్కువ సమయం తీసుకుంటాను. గతంలో నేను ఒక రిలేషన్‌షిప్‌లో ఉన్నాను. సినిమాల్లోకి అడుగు పెట్టిన కొత్తలో ఒక వ్యక్తిని ఇష్టపడ్డాను. అతడి నుంచి వేధింపులు ఎదుర్కొన్నా. అంతకంటే ముందు కూడా ఒకసారి అలాంటి ప్రేమను చూశా. రిలేషన్‌షిప్‌లో ఇలా ఎందుకు జరుగుతుంది అని భయపడ్డా.

ప్రస్తుతానికి ప్రశాంతంగా ఉన్నా. నా గత అనుభవాల వల్ల నేను మళ్లీ ప్రేమలో పడాలంటే ఎంతో ఆలోచిస్తున్నా’’ అని ఐశ్వర్య చెప్పింది. ‘రెండుజళ్ళ సీత’, ‘ఆనంద భైరవి’ లాంటి చిత్రాల్లో నటించిన దివంగత తెలుగు నటుడు రాజేష్ తనయురాలే ఐశ్వర్య. ఆమె చిన్నతనంలోనే తండ్రి చనిపోయాడు.

ఆ తర్వాత కుటుంబానికి ఆర్థిక ఇబ్బందులు తలెత్తాయి. సినీ నేపథ్యం ఉన్నా సరే.. యుక్త వయసులో ఆమె కొన్ని పార్ట్ టైం ఉద్యోగాలు చేసింది. ఆ తర్వాత అనుకోకుండా సినిమాల్లోకి వచ్చింది. ‘కాకా ముట్టై’ సహా కొన్ని చిత్రాల్లో అద్భుతంగా నటించడంతో తన పేరు మార్మోగింది. ఇప్పుడు తమిళంతో పాటు తెలుగులోనూ ఆమె వరుస అవకాశాలందుకుంటోంది. ‘సంక్రాంతికి వస్తున్నాం’ ఐశ్వర్య కెరీర్‌కు పెద్ద బ్రేక్ అనే చెప్పాలి.