ఫిబ్రవరి మామూలుగా సినిమాలకు అంతగా కలిసొచ్చే సీజన్ కాదు. సినిమాలకు మహారాజ పోషకులైన యూత్ పరీక్షలకు సంబంధించిన హడావుడిలో ఉంటారు కాబట్టి.. ఆక్యుపెన్సీలు పడిపోతుంటాయి. ఐతే ఈ నెలలో కొంచెం సందడి ఉండే వీకెండ్ అంటే.. వాలెంటైన్స్ డే టైంలోనే అని చెప్పాలి. ఆ వీకెండ్లో రెండు మూడు కొత్త సినిమాలు రిలీజవుతుంటాయి. ఎక్కువగా ప్రేమకథా చిత్రాలనే ఈ టైంలో రిలీజ్ చేస్తుంటారు.
కానీ ఈసారి టాలీవుడ్ బాక్సాఫీస్ బరిలో అలాంటి సినిమాలేవీ లేవు. కిరణ్ అబ్బవరం సినిమా ‘దిల్ రుబా’ ప్రేమకథా చిత్రమే కానీ.. ఫిబ్రవరి 14కు అనుకున్న ఆ చిత్రాన్ని ఎందుకో వాయిదా వేసేశారు. విశ్వక్సేన్ కామెడీ మూవీ ‘లైలా’తో పాటు బ్రహ్మానందం, ఆయన తనయుడు రాజా గౌతమ్ కలిసి నటించిన కామెడీ ప్లస్ ఎమోషనల్ డ్రామా ‘బ్రహ్మ ఆనందం’ వేలంటైన్స్ డే వీకెండ్లో ప్రేక్షకులను పలకరించబోతున్నాయి.
ఐతే ఇవి ఇంట్రెస్టింగ్ సినిమాల్లాగే కనిపిస్తున్నా వీటి చుట్టూ బజ్ ఓ మోస్తరుగానే ఉంది. వీటికి పోటీగా కొన్ని పాత క్లాసిక్ లవ్ స్టోరీలను వేలంటైన్స్ డే వీకెండ్‌లో థియేటర్లలోకి దించుతున్నారు. కొవిడ్ టైంలో ఓటీటీలో నేరుగా రిలీజై సూపర్ హిట్టయిన ‘కృష్ణ అండ్ హిజ్ లీల’ను ‘ఇట్స్ కాంప్లికేటెడ్’ పేరుతో ఇప్పుడు థియేటర్లలో రిలీజ్ చేస్తూ కొత్త ప్రయోగం చేస్తున్నాడు నిర్మాత రానా దగ్గుబాటి.
దీనికి ప్రమోషన్లు చేస్తున్నారు. అడ్వాన్స్ బుకింగ్స్ కూడా ఆశాజనకంగా ఉన్నాయి. మరోవైపు ఆరెంజ్, నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమొరీస్, సూర్య సన్నాఫ్ కృష్ణన్, ఎటో వెళ్లిపోయింది మనసు లాంటి మంచి ఫీల్ ఉన్న లవ్ స్టోరీలను వేలంటైన్స్ డే వీకెండ్లో రీ రిలీజ్ చేస్తున్నారు. బుకింగ్స్ ఓపెన్ అయిన సినిమాలకు బుక్ మై షోలో స్పందన కూడా బాగుంది. చూస్తుంటే కొత్త సినిమాలను వెనక్కి నెట్టి ఈ పాత చిత్రాలే ఈ వీకెండ్ పైచేయి సాధిస్తే ఆశ్చర్యం లేదనిపిస్తోంది.