బన్నీకి పాకిస్థాన్‌లో అంత ఫాలోయింగా?

సినిమాలు చూసే విషయంలో రాష్ట్రాలు, దేశాల మధ్య హద్దులు ఎప్పుడో చెరిగిపోయాయి. ఓటీటీల్లో ఎక్కడెక్కడి సినిమాలనో చూసేస్తున్నారు జనం. వరల్డ్ సినిమా అన్నది అందరికీ చేరువ అయిపోయింది. బాహుబలి సినిమా దేశాన్ని ఏకం చేస్తే.. ఆ తర్వాత కేజీఎఫ్, పుష్ప, ఆర్ఆర్ఆర్ లాంటి సినిమాలు పాన్ ఇండియా స్థాయిలో అద్భుతాలు చేశాయి. ఈ చిత్రాలకు అంతర్జాతీయ స్థాయిలో కూడా అద్భుతమైన ఆదరణ దక్కింది.

వీటిలో నటించిన హీరోలకు దేశ విదేశాల్లో తిరుగులేని ఫాలోయింగ్ లభించింది. మిగతా సినిమాలతో పోలిస్తే పుష్ప సగటు మాస్ మూవీలా కనిపించినా.. దానికి వచ్చిన రీచ్ అసాధారణం. వెస్టిండీస్‌లో జరిగే కరీబియన్ ప్రిమియర్ క్రికెట్ లీగ్‌లో.. ఐరోపాలో జరిగే ఫుట్ బాల్ లీగ్‌లో.. క్రీడాకారులు ‘పుష్ప’ మేనరిజాన్ని అనుకరించడం అంటే చిన్న విషయం కాదు. ఈ సినిమా పాకిస్థాన్‌లో సైతం ఆదరణ పొందడం, అల్లు అర్జున్‌కు తిరుగులేని ఫాలోయింగ్ సంపాదించి పెట్టడం విశేషం.

బన్నీకి పాకిస్థానీల్లో ఉన్న ఫాలోయింగ్ ఎలాంటిదో తెలియజేసే రెండు ఉదంతాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. ‘పుష్ప-2’ థ్యాంక్స్ మీట్‌లో సునీల్ మాట్లాడుతూ.. తాను స్పెయిన్‌లో ఓ సినిమా షూటింగ్ కోసం వెళ్లినపుడు లేట్ నైట్ తిండి దొరక్క ఇబ్బంది పడినట్లు వెల్లడించాడు. రెస్టారెంట్లన్నీ మూత పడ్డ సమయంలో అర్ధరాత్రి 2 గంటలు దాటాక ఒక రెస్టారెంట్‌కు వెళ్తే దాన్ని నడిపే వ్యక్తి తనను గుర్తు పట్టి ‘పుష్ప’ సినిమాలో విలన్ పాత్ర చేసిందే తనేనా అని అడిగినట్లు తెలిపాడు సునీల్. అతను పాకిస్థానీ అని..

ఆ సమయంలో తనతో పాటు డైరెక్షన్ టీంకు వంట చేసిపెట్టాడని సునీల్ వెల్లడించాడు. ఇదిలా ఉంటే.. ‘తండేల్’ మూవీ తెర వెనుక కథ ఒకటి ప్రచారంలోకి వచ్చింది. ఇది రియల్ స్టోరీ అన్న సంగతి తెలిసిందే. పాకిస్థాన్‌లో చిక్కుకున్న జాలరులు అక్కడి నుంచి తిరిగొచ్చే సమయంలో ఒక పాకిస్థాన్ పోలీస్.. అల్లు అర్జున్ పేరు చెప్పి తన ఆటోగ్రాఫ్ కావాలని అడిగాడట. కార్తీక్ అనే రైటర్.. బన్నీ ఆటోగ్రాఫ్ కోసం గీతా ఆర్ట్స్ ఆఫీసుకు రావడం..

బన్నీ వాసుకు ఈ జాలరుల కథ చెప్పడం.. ఈ క్రమంలో ఈ సినిమా తీయడం గురించి చర్చ జరగడం.. అలా ‘తండేల్’ కథ పట్టాలెక్కిందట. ఐతే ఈ వ్యవహారం ‘పుష్ప’ రావడానికి ముందే జరగడంతో.. అప్పుడే బన్నీకి పాకిస్థాన్‌లో అంత ఫాలోయింగ్ ఉందా అని అందరూ ఆశ్చర్యపోతున్నారు.