కొన్నేళ్ల వ్యవధిలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సూపర్ స్టార్ మహేష్ బాబు లాంటి పెద్ద హీరోలతో ‘కొమరం పులి’, ‘ఖలేజా’ లాంటి భారీ చిత్రాలను నిర్మించాడు శింగనమల రమేష్ అనే ప్రొడ్యూసర్. కానీ ఆ రెండు చిత్రాలూ డిజాస్టర్లయ్యాయి. దీంతో ఆయన అడ్రస్ లేకుండా పోయాడు. ఆ తర్వాత ఆయన ఒక కేసులో చిక్కుకుని జైలు పాలయ్యాడు. తర్వాత బెయిల్ మీద బయటికి వచ్చాడు. ఈ కేసులో ఇటీవలే కోర్టు ఆయన్ని నిర్దోషిగా ప్రకటించగా.. ఈ సందర్భంగా ప్రెస్ మీట్ పెట్టి రమేష్ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ అయ్యాయి.
కొమరం పులి, ఖలేజా చిత్రాలు రెంటికీ కలిపి వంద కోట్ల నష్టం వచ్చిందని.. కానీ తనను ఆ చిత్రాల హీరోలు సహా ఎవ్వరూ పట్టించుకోలేదని అన్నారు రమేష్. ఈ సందర్భంగా తనను కొందరు మోసం చేశారని కూడా ఆయన ఆరోపణలు చేశారు.కాగా రమేష్ మీద కౌంటర్ ఎటాక్ చేస్తూ వైజయంతి రెడ్డి అనే ఫైనాన్షియర్ తరఫున ఆమె భర్త సదానంద్ తాజాగా ప్రెస్ మీట్ పెట్టి తీవ్ర ఆరోపణలు చేశారు. కొన్ని సంచలన విషయాలను బయటపెట్టారు.
శింగనమల రమేష్ బాబు పచ్చి మోసగాడు అని.. తమ దగ్గర తమ దగ్గర ఫైనాన్స్ తీసుకుని, ఆ డబ్బులతోనే కొమరంపులి, ఖలేజా సినిమాలు తీశారని ఆరోపించారు సదానంద్. ఆ రెండు సినిమాల షూటింగులు జరిగేటప్పడు మద్దెలచెరువు సూరి, భానుకిరణ్ వంటి ఫ్యాక్షనిస్టులతో పాటు ఎందరో రౌడీలు వచ్చి లొకేషన్లలో కూర్చునేవారని.. మరి షూటింగులు చేసేందుకు హీరోలు, ఆరిస్టులు ఎలా వస్తారని సదానంద్ ప్రవ్నించారు.
రమేష్ తప్పుడు విధానాలు, అలవాట్ల వల్లే ఆ రెండు సినిమాల షూటింగులు ఆలస్యం అయ్యాయి తప్ప హీరోలు, డైరెక్టర్ల వల్ల కాదని ఆయన స్పష్టం చేశారు. రమేష్ స్వయంకృతాపరాధం వల్ల సినిమాలను రిలీజ్ చేయలేకపోతే సి.కళ్యాణ్ రంగంలోకి దిగి ఆ చిత్రలు బయటికి వచ్చేలా చేశారన్నారు. ఆ సినిమాల రిలీజ్ తర్వాత తాము ఇచ్చిన డబ్బులు తిరిగి ఇవ్వమని రమేష్‌ను అడిగితే,… అతని రౌడీ గ్యాంగ్, భాను కిరణ్ గ్యాంగ్ తన తలపై తుపాకి గురిపెట్టి చంపివేస్తాం అంటూ బెదిరించారని సదానంద్ ఆరోపించారు.
దీనిపై అప్పుడే తాము హైదరాబాద్ సీసీఎస్‌లో కేసు కూడా పెట్టామన్నారు. తర్వాత ఈ కేసు సీఐడీకి బదిలీ అయిందన్నారు. రమేష్ తదితరులపై మేము పెట్టిన కేసును నాంపల్లి క్రిమినల్ కోర్టు ఇటీవల కొట్టి వేసిందని.. త్వరలో తాము దీని మీద హైకోర్టులో అప్పీల్‌కు వెళ్తున్నామని సదానంద్ వెల్లడించారు.
దాదాపు 300 కోట్ల రూపాయల మేర అతను తన బాధితులకు డబ్బులు ఇవ్వాల్సి ఉందని సదానంద్ ఆరోపించారు.మిగతా బాదితులందరినీ కలుపుకుని తెలంగాణ, తమిళనాడు సీఎంలను కలిసి అన్ని విషయాలను వివరిస్తామని సదానంద్ తెలిపారు.