జూనియర్ ఎన్టీఆర్ తన ఫ్యాన్స్ ని కలుసుకోవడానికి త్వరలోనే ఒక వేడుక ఏర్పాటు చేస్తానని, అప్పటిదాకా ఓపిగ్గా ఎదురు చూడమని సుదీర్ఘమైన సందేశం విడుదల చేయడం చర్చనీయాంశంగా మారింది. మీ భద్రత, ప్రాణాల కంటే తనకు ఇంకేదీ ముఖ్యం కాదని తారక్ అందులో ప్రత్యేకంగా ప్రస్తావించడం ఎవరికీ ప్రమాదం జరగకూడదన్న ఆలోచనను బయట పెట్టింది.
నిజానికి అభిమానులు అంతగా ఫీలయ్యి సోషల్ మీడియాలో తమ హీరోని కలుసుకునేందుకు డిమాండ్ చేయడం వెనుక కారణాలు ఉన్నాయి. దేవర విడుదలకు ముందు ప్రీ రిలీజ్ ఈవెంట్ రద్దు కావడం వాటిలో ప్రధానమైంది.
తిరిగి మళ్ళీ నిర్వహిస్తారనుకుంటే జరగలేదు. పోనీ దేవర అంత పెద్ద బ్లాక్ బస్టరయ్యాక సక్సెస్ మీట్ అయినా ఫ్యాన్స్ తో కలిపి చేస్తారనుకుంటే అక్కడా నిరాశే ఎదురయ్యింది. నిర్మాత నాగవంశీ దుబాయ్ తీసుకెళ్లి డిస్ట్రిబ్యూటర్లకు పార్టీ ఇచ్చారు కానీ ఇక్కడ నో సెలబ్రేషన్.
నోవాటెల్ లో రద్దీని తట్టుకోలేక క్యాన్సిల్ చేయడం వరకు ఓకే కానీ తర్వాత ఏపీలో అయినా చేసి ఉంటే బాగుండేదని అభిమానులు డిమాండ్ చేసినప్పటికీ లాభం లేకపోయింది. కనీసం ఫోటో సెషన్ కూడా లేవు. అరవింద సమేత వీర రాఘవ తర్వాత సోలో హీరోగా జూనియర్ ఎన్టీఆర్ కు సుదీర్ఘమైన గ్యాప్ వచ్చేసింది. ఆర్ఆర్ఆర్ మల్టీస్టారర్ అయిపోయింది.
ఇవన్నీ ఒక ఎత్తు అయితే కొందరు ఫ్యాన్స్ ఎలాగైనా తారక్ ను కలుసుకోవాలని వందల కిలోమీటర్లు పాదయాత్ర చేయడం మరో ప్రహసనంగా మారింది. దీని వల్ల వాళ్ళ ఆరోగ్యాలు రిస్క్ లో పడతాయని గుర్తించిన జూనియర్ అలా చేస్తేనే తనను కలుసుకోవచ్చనే అభిప్రాయాన్ని తప్పని చెప్పే ఉద్దేశం కూడా ప్రెస్ నోట్ లో ఉంది.
ఈ ఏడాది ఎలాగూ వార్ 2 రిలీజ్ ఉంది. దానికి ఏపీ తెలంగాణలో ఈవెంట్లు ఉంటాయి. ప్రశాంత్ నీల్ సినిమా కూడా 2026 సంక్రాంతికే అనుకుంటున్నారు. అంటే తక్కువ గ్యాప్ లో జూనియర్ ఎన్టీఆర్ ని పబ్లిక్ ప్లాట్ ఫార్మ్స్ మీద చూడొచ్చు. కాకపోతే అభిమానులు కాస్తంత సహనంగా ఉండటం అవసరం.