ఈసారి ‘అక్కినేని లెక్కలు’ మారబోతున్నాయా

ఫిబ్రవరి ఏడు కోసం అక్కినేని అభిమానుల ఎదురు చూపులు మాములుగా లేవు. గత కొంత కాలంగా గట్టిగా చెప్పుకునే బ్లాక్ బస్టర్ లేక ఫ్యాన్స్ పడుతున్న కలవరం అంతా ఇంతా కాదు. గత ఏడాది నా సామిరంగా మంచి వసూళ్లనే తెచ్చింది కానీ సోగ్గాడే చిన్ని నాయన రేంజ్ లో మేజిక్ చేయలేకపోయింది.

ఇక అఖిల్ గురించి తెలిసిందే. ఏజెంట్ డిజాస్టర్ తర్వాత ఏకంగా ఏడాదిన్నర గ్యాప్ తీసుకుని ఇటీవలే లెనిన్ మొదలుపెట్టాడు. నాగ చైతన్య విషయానికి వస్తే లవ్ స్టోరీ తర్వాత మళ్ళీ అంత బ్రేక్ దక్కలేదు. హిందీ డెబ్యూ లాల్ సింగ్ చద్దా తేడా కొట్టింది. పక్కరాష్ట్రం దర్శకుడితో కస్టడీ చేస్తే ఫ్లాప్ అయ్యింది.

కానీ తండేల్ కు పాజిటివ్ వైబ్స్ ఉన్నాయి. శ్రీకాకుళం సముద్ర ప్రాంతంలో ఒక అందమైన ప్రేమజంటకు పాకిస్థాన్ థ్రెడ్ ని జోడించి చందూ మొండేటి ఆవిష్కరించిన ఎమోషనల్ డ్రామా మీద అంచనాలు ఎక్కువగా ఉన్నాయి. ఆర్ట్ డైరెక్టర్ నాగేంద్ర తనగల చెప్పిన దాని ప్రకారం తండేల్ విజువల్స్ ప్రేక్షకులను అబ్బురపరచబోతున్నాయి.

ఇది కాకుండా విరూపాక్ష ఫేమ్ కార్తీక్ దండు దర్శకత్వంలో రూపొందబోయే ఎన్సి 24 కూడా ఈయనే పని చేస్తున్నారు. ఇప్పటిదాకా చూడని సరికొత్త ప్రపంచాన్ని చైతు సినిమాలో చూస్తారని, హాలీవుడ్ రేంజ్ లో కథా కథనాలు అందరిని మెప్పిస్తాయని నమ్మకంగా చెబుతున్నారు.

చూస్తుంటే అక్కినేని లెక్కలు మారేలా కనిపిస్తున్నాయి. సేఫ్ గేమ్ పక్కనపెట్టి చైతు రిస్కులు చేస్తున్నాడు. సరికొత్త ప్రపంచాలను సృష్టిస్తున్న దర్శకులతో చేతులు కలుపుతున్నాడు. ఇది మంచి ఫలితాలు ఇచ్చేలా ఉంది. నాగార్జున సైతం క్యామియోనా స్పెషల్ రోలా అనేది పట్టించుకోకుండా తన వల్ల సినిమా ఎలివేట్ అవుతుందని భావిస్తే ఒప్పేసుకుంటున్నారు.

దాని ఫలితమే కుబేర, కూలి. ఈ రెండు చిత్రాల్లో నాగ్ క్యారెక్టర్స్ చిరస్థాయిగా నిలిచిపోతాయని ఇన్ సైడ్ టాక్స్ తెగ ఊరిస్తున్నాయి. రెగ్యులర్ ఫార్ములాకి దూరంగా అక్కినేని హీరోలు తీసుకుంటున్న నిర్ణయాలు బాక్సాఫీస్ గేమ్ ని మార్చేలా కనిపిస్తున్నాయి.