పాపం అభిషేక్ బచ్చన్

ఇండియన్ సినిమా హిస్టరీలోనే బిగ్గెస్ట్ స్టార్లలో ఒకరు అమితాబ్ బచ్చన్. ఆయన ఘన వారసత్వాన్నందుకుని ఇండస్ట్రీలోకి వచ్చిన అభిషేక్ బచ్చన్ మాత్రం హీరోగా అనుకున్నంతగా సక్సెస్ కాలేకపోయాడు. తొలి చిత్రం ‘రెఫ్యూజీ’ నుంచి ఏది కూడా అభిషేక్‌కు స్టార్ ఇమేజ్ తెచ్చిపెట్టలేకపోయింది.

కెరీర్లో కొన్ని విజయాలున్నాయి కానీ.. అభిషేక్ సోలో హీరోగా నటించిన పెద్ద సినిమాలేవీ కూడా అతడికి ఆశించిన ఫలితాలనివ్వలేదు. అతను ఎన్నో ఆశలతో చేసిన సినిమాలన్నీ కూడా నిరాశనే మిగిల్చాయి. ఈ మధ్యనే అభిషేక్ ‘బ్రీత్-2’తో డిజిటల్ డెబ్యూ చేశాడు. కానీ ఎప్పట్నుంచో చూసిన కథనే కొంచెం అటు ఇటు తిప్పి తీయడంతో అది ప్రేక్షకుల తిరస్కారానికి గురైంది. కనీసం తన కొత్త చిత్రం ‘బిగ్ బుల్’ అయినా తన రాత మారుస్తుందేమో అనుకుంటే దానికి ఊహించని అవాంతరం వచ్చి పడింది.

‘బిగ్ బుల్’ను హాట్ స్టార్ సంస్థ చేజిక్కించుకుని త్వరలో డిజిటల్ రిలీజ్‌కు రెడీ అవుతున్న సంగతి తెలిసిందే. ఐతే ఈ చిత్రం హాట్ స్టార్ వాళ్ల చేతికొచ్చి దాదాపు నాలుగు నెలలవుతోంది. కానీ రిలీజ్ విషయంలో ఆలస్యం చేశారు.

ఈలోపు ‘స్కామ్ 1992’ పేరుతో ఒక వెబ్ సిరీస్ విడుదలైంది. సోనీ లైవ్‌లో పెద్దగా అంచనాల్లేకుండా విడుదలైన ఈ సిరీస్‌కు అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. ఇండియాలో తెరకెక్కిన బెస్ట్ వెబ్ సిరీస్‌గా దీన్ని కీర్తిస్తున్నారు. అదే ఇప్పుడు ‘బిగ్ బుల్’కు పెద్ద అడ్డంకిగా మారింది. ఆ వెబ్ సిరీస్‌, అభిషేక్ సినిమా తెరకెక్కింది ఒకే కథతో. 90వ దశకంలో స్టాక్ మార్కెట్ కుంభకోణంతో సంచలనం రేపిన హర్షద్ మెహతా జీవిత నేపథ్యంలోనే ఇవి రెండూ తెరకెక్కాయి.

ఐతే వెబ్ సిరీస్ పెద్దగా పేరులేని నటుడిగా, పరిమిత బడ్జెట్లో తీసిన నేపథ్యంలో దాన్ని లైట్ తీసుకుంది ‘బిగ్ బుల్’ టీం. దానికేమాత్రం ఆదరణ ఉంటుందిలే అనుకున్నారు. కానీ అది అదిరిపోయే రెస్పాన్స్ తెచ్చుకుంది. జనాలు దాన్ని ఎగబడి చూస్తున్నారు. హర్షద్ మెహతా కథేంటో జనాలకు తెలిసిపోతోంది. పైగా ఆ సిరీస్‌కు మంచి రెస్పాన్స్ కూడా వస్తోంది. ఇప్పుడిక అభిషేక్ సినిమా మీద ఏం ఆసక్తి ఉంటుంది? జనాలు ఆ సినిమా చూసినా ‘స్కామ్ 1992’తో పోల్చి చూడటమూ సమస్యే. అభిషేక్ ఎన్నో ఆశలు పెట్టుకున్న సినిమా విషయంలో ఇలా జరుగుతుందని ఊహించి ఉండడు పాపం.