తెలంగాణలో ఇకపై 8.40 తర్వాతే సినిమా

తెలంగాణలో కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యాక బెనిఫిట్ షోలను ఎప్పుడు కావాలంటే అప్పుడు వేసుకునే స్వేచ్ఛ లభించింది నిర్మాతలకు. పెద్ద సినిమాలకు అర్ధరాత్రి నుంచి షోలు వేసుకోవడానికి ఎలాంటి ఇబ్బందీ లేకుండా సాగింది. కానీ ఇదంతా ‘పుష్ప-2’ సినిమా విడుదల వరకే. ఆ చిత్రానికి ముందు రోజు రాత్రి నుంచి పెయిడ్ ప్రిమియర్స్ పడిపోయాయి. అర్ధరాత్రి షోలూ రన్ అయ్యాయి. కానీ సంధ్య థియేటర్ ఘటన తర్వాత మొత్తం పరిస్థితి మారిపోయింది.

అర్ధరాత్రి షోలు అంతర్ధానం అయిపోయాయి. సంక్రాంతి సినిమాలకు తెల్లవారుజామునే షోలు పడ్డాయి. కానీ ఇకపై అవి కూడా పడడం కష్టమే. ఇకపై తెలంగాణలో బెనిఫిట్ షోలకు అనుమతులు ఇవ్వొద్దని హైకోర్టు తాజాగా స్పష్టం చేయడమే అందుకు కారణం. సినిమా టికెట్ల ధరల పెంపు, స్పెషల్ షోల అనుమతికి సంబంధించి ఓ పిటిషన్‌పై హైకోర్టులో తాజాగా విచారణ జరిగింది. ప్రభుత్వం తరపు న్యాయవాది వాదనలు వినిపించారు.

సినిమాలకు టికెట్ల ధరలను పెంచుతూ ఇచ్చిన అనుమతులను ప్రభుత్వం రద్దు చేసినట్లు న్యాయస్థానానికి వివరించారు. ప్రభుత్వం తరపు న్యాయవాది వాదనలు విన్న హైకోర్టు.. కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రభుత్వం చేసిన సినిమాటోగ్రఫీ చట్టం ప్రకారం అర్ధరాత్రి 1.30 గంటల నుంచి ఉదయం 8.40 గంటల మధ్య ఎలాంటి స్పెషల్ షోలకు అనుమతి వద్దని.. ఈ చట్టాన్ని పాటించాలని ఆదేశించింది.

తదుపరి విచారణను వచ్చేనెల 21వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు హైకోర్టు ప్రకటించింది. దీంతో తెలంగాణలో అర్ధరాత్రి, తెల్లవారుజామున స్పెషల్‌ షోలు రద్దయినట్టే భావించాలి. మరి పెద్ద సినిమాలకు ఉదయం 8.40 లోపు షోలకు అనుమతి లేదంటే ఇండస్ట్రీ జనాలు లబోదిబోమనడం ఖాయం. అలాగే అభిమానులకూ ఇది నిరాశ కలిగించే విషయమే.