నెగిటివిటీ ప్రభావానికి సినీ బాధితులు ఎందరో

సోషల్ మీడియా ప్రపంచంలో నెగటివిటీ ఎంతగా పెరిగిపోయిందంటే గాలి కన్నా వేగంగా ఇదే ప్రయాణిస్తోంది. కొందరి ఆలోచనలను, వ్యక్తిత్వాలను తీవ్రంగా ప్రభావితం చేస్తోంది. ఇటీవలే తమన్ డాకు మహారాజ్ ఈవెంట్ లో ఎంతగా బాధ పడ్డాడో చూశాం. ఏకంగా చిరంజీవి సైతం దీని గురించి స్పందించడం చర్చనీయాంశం అయ్యింది.

వీళ్ళొక్కరే కాదు గతంలో అనసూయ, సమంతా, చిన్మయి శ్రీపాద, విజయ్ దేవరకొండ ఇలా ఎందరో ట్రోలింగ్ బారిన పడిన వాళ్ళే. అందుకే ఏదైనా షేర్ చేయాలంటే ఒకటికి పదిసార్లు ఆలోచించే పరిస్థితి తలెత్తింది. గీత రచయిత కృష్ణకాంత్ తాజాగా చెప్పిన అనుభవం వింటే మరోసారి అర్థమవుతుంది.

రాధే శ్యామ్ విడుదల టైంలో ఆడియో ఆల్బమ్ మీద విపరీతమైన అంచనాలు నెలకొన్నాయి. మాస్ సినిమా కాదు ప్రేమకథని తెలిసినా కూడా ఫ్యాన్స్ ఎక్కువగా ఊహించుకున్నారు. దీంతో ఒక సాంగ్ రావడం ఆలస్యం దాని మీద నెగటివిటీ దావానలంలా పాకిపోయింది. దీంతో కృష్ణకాంత్ తాను ఎంతో ఇష్టపడి రాసిన ‘నే నిన్నటి రవి నువ్వు రేపటి శశి’ని షేర్ చేసుకోవడానికి భయపడ్డారు.

సాహిత్యం అర్థం కాదేమోననే ఉద్దేశంతో ఆగిపోయారు. తీరా చూస్తే సాంగ్ పెద్ద హిట్ అయ్యింది. అందరి నుంచి ప్రశంసలు దక్కాయి. మంచి పాటగా పేరు తెచ్చుకుంది. కానీ ముందే రావాల్సిన రీచ్ కేవలం సోషల్ మీడియా కారణంగా లేటయ్యింది.

ఇవి కేవలం కొన్ని ఉదాహరణలు మాత్రమే. ఆచార్య వచ్చాక కొరటాల శివ ట్విట్టర్ నుంచి సెలవు తీసుకుని ప్రశాంతంగా దేవర మీద ఫోకస్ పెట్టారు. ప్రభాస్ కు ఇప్పటికీ ఎక్స్ లో అకౌంట్ లేదు. బాలకృష్ణ ఈ వ్యవహారాల మీద ఆసక్తి చూపించలేదు. కొన్నేళ్ల క్రితం రామ్ చరణ్ బ్రేక్ తీసుకుని మళ్ళీ రీ ఎంట్రీ ఇచ్చాడు.

సెలబ్రిటీలను నెగటివిటీ ఆ స్థాయిలో ప్రభావం చూపిస్తోంది. విలువైన సమయాన్ని యూవత అలా వృథా చేసుకోవడం వల్ల ఎవరికి ప్రయోజనం లేకపోయినా ఈ ధోరణి మాత్రం తగ్గడం లేదు సరికదా అంతకంతా పెరుగుతోంది. దీన్ని కట్టడి చేయడం అసాధ్యం. స్వీయ విచక్షణ తప్ప వేరే మార్గం లేదు.