తీవ్ర వివాదాలు ఎదురుకుంటూ విపరీతమైన వాయిదాలకు లోనవుతూ వచ్చిన ఎమర్జెన్సీ ఇటీవలే విడుదలయ్యింది. క్రిష్ వదిలేశాక మణికర్ణిక బ్యాలన్స్ పూర్తి చేసిన అనుభవం ఇచ్చిన నమ్మకమో ఏమో కానీ కంగనా రౌనత్ మరోసారి దర్శకురాలి అవతారం ఎత్తింది.
దశాబ్దాల క్రితం దేశాన్ని కుదిపేసిన ఎమర్జెన్సీ కాలం నాటి పరిస్థితులను నేపథ్యంగా తీసుకున్న కంగనా మాజీ ప్రధాని ఇందిరా గాంధీని వాస్తవిక కోణంలో చూపించలేదని కాంగ్రెస్ పార్టీ అభ్యంతరం వ్యక్తం చేస్తూ వచ్చింది. అయితే ఎట్టకేలకు థియేటర్ మోక్షం దక్కించుకున్న ఈ హిస్టారికల్ డ్రామాలో వివాదాలు ఓకే కానీ విషయం మాత్రం వీకే అనిపించుకుంది.
ఇందిరా గాంధీ బాల్యం, నెహ్రు కుటుంబ పరిస్థితులు, ఆనాటి రాజకీయ వాతావరణం, సామజిక వైరుధ్యాలు ఇలా చాలా అంశాలు టచ్ చేసిన కంగనా రౌనత్ ఎమర్జెన్సీ నాటి దుర్భర స్థితిని కళ్ళకు కట్టినట్టు చూపించడంలో తడబాటుకు గురయ్యింది. ఇందిరా వారసుడు సంజయ్ గాంధి చేసిన తప్పులను ఎత్తి చూపించే క్రమంలో వాస్తవాలు కొన్ని పక్కదారి పట్టినట్టు అనిపించక మానదు.
ఎమర్జెన్సీ టైంలో దేశం ఎంత గడ్డు కాలం అనుభవించిందో చూపించడానికి బదులు నాణేనికి ఒక వైపే హైలైట్ చేసినట్టు కంగనా ఎంచుకున్న నెరేషన్ ఒక వర్గం మద్దతుదారులకు మాత్రమే కన్విన్సింగ్ గా అనిపిస్తుంది. మిగిలినవారికి కష్టమే.
కంగనాలోని దర్శకురాలు మరింత మెరుగుపడాల్సింది చాలా ఉంది. కాకపోతే గతంలో ఇంచుమించు ఇదే బ్యాక్ డ్రాప్ తో వచ్చిన ఇందూ సర్కార్ కంటే ఈ ఎమర్జెన్సీ కొంత బెటర్ అనిపిస్తుంది. ఆర్టిస్టులు పాత్రలకు జీవం పోశారు. ఇదంతా ఎలా ఉన్నా డీసెంట్ ఓపెనింగ్స్ తెచ్చుకున్న ఎమర్జెన్సీ రిలీజయ్యాక కాంట్రావర్సిలు తీవ్రం చేస్తుందేమో అనుకుంటే అలా జరగకపోవడం కొంత రిలీఫ్.
1975 నుంచి 77 మధ్య జరిగిన కీలక విషయాలు ఇందులో చాలా ప్రస్తావించలేదు. అసలు ఎమర్జెన్సీకి దారి తీసిన సంఘటనలు పూర్తిగా చూపించకపోవడం లోపమే. నటిగా కంగనా మీద వేలెత్తి చూపించలేం కానీ దర్శకురాలిగా మెచ్చుకునే ఛాన్స్ ఇవ్వలేదు.