రాబిన్ హుడ్ మీద నమ్మకం వచ్చేసింది

గత డిసెంబర్లోనే రావాల్సిన రాబిన్ హుడ్ తిరిగి సంక్రాంతి అనుకుని పోటీ వల్ల మళ్ళీ వద్దనుకుని చివరాఖరికి మార్చి 28 విడుదలవుతున్న సంగతి తెలిసిందే. వరస ఫ్లాపుల తర్వాత ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ కొట్టాల్సిన బాధ్యత మోస్తున్న నితిన్ కు ఈ సినిమా మీద భారీ ఆశలున్నాయి. అందులోనూ కెరీర్ పెద్ద హిట్ భీష్మ ఇచ్చిన వెంకీ కుడుముల దర్శకుడు కావడంతో ఆ నమ్మకం రెట్టింపయ్యింది. నిన్న జరిగిన ప్రెస్ మీట్ లో హీరో, డైరెక్టర్ ఇద్దరి మాటల్లో అదే వ్యక్తమయ్యింది. ఫైనల్ కాపీ చూశాక ఇద్దరు మాట్లాడుకుని, ప్రేమించుకుని, కామించబోతు ఆగిపోయామని నితిన్ చెప్పడం ఘొల్లున నవ్వించింది.

అంతగా సినిమా నచ్చిందని చెప్పడం నితిన్ ఉద్దేశం. శ్రీలీల, వెంకీ కుడుముల, నిర్మాత రవిశంకర్ తదితరులు మాటల్లోనూ ఇదే స్పష్టమయ్యింది. నాటకిరీటీ రాజేంద్ర ప్రసాద్ కొన్నేళ్ల పాటు తనను గుర్తు పెట్టుకుంటారని, పోస్టర్లలో తాను కనిపించకపోయినా గొప్ప పాత్ర ఇచ్చారంటూ తనదైన శైలిలో నవ్వులు పూయిస్తూ చెప్పారు. వెంకీ కుడుములకు ఈ సక్సెస్ చాలా కీలకం. ఛలో తర్వాత భీష్మ సూపర్ హిట్ అయ్యింది. చిరంజీవి ప్రాజెక్టు అనౌన్స్ మెంట్ దాకా వచ్చి ఆగిపోయింది. తర్వాత కొంత గ్యాప్ తీసుకుని రాబిన్ హుడ్ సిద్ధం చేసుకున్నాడు. ఇది బ్లాక్ బస్టర్ అయితే టాప్ లీగ్ లోకి వచ్చేయొచ్చు.

నితిన్ విషయానికి వస్తే తక్కువ నిడివిలో బ్యాక్ టు బ్యాక్ పలకరించబోతున్నాడు. ఇప్పుడు రాబిన్ హుడ్ కనక వర్కౌట్ అయితే ఆపై మే లేదా జూన్ లో రిలీజయ్యే వేణు శ్రీరామ్ తమ్ముడు బిజినెస్ కి హైప్ వస్తుంది. రాబిన్ హుడ్ లో లక్కీ గర్ల్ శ్రీలీల ఎలాగూ ఉంది కాబట్టి ఫ్యాన్స్ నిశ్చింతగా ఉన్నారు. అలాని పోటీ లేదని కాదు. మ్యాడ్ స్క్వేర్ కి యూత్ లో మంచి క్రేజ్ ఉంది. ఇది కూడా మార్చి 28 వస్తోంది. ఒక రోజు ముందు వచ్చే డబ్బింగ్ బొమ్మలు వీరధీరశూర పార్ట్ 2, ఎల్2 ఎంపురాన్ ని తక్కువంచనా వేయడానికి లేదు. ఇవన్నీ ఎలా ఉన్నా కంటెంట్ బాగుంటే ఏ కాంపిటీషన్ రాబిన్ హుడ్ ని ఏం చేయలేదు. చూద్దాం.