బాలీవుడ్ పతనానికి కారణం చెప్పిన ఆమిర్

ఒకప్పుడు ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో బాలీవుడ్ చిత్రాల రేంజే వేరుగా ఉండేది. వాటి బడ్జెట్లు, బిజినెస్, వసూళ్లు అన్నీ కూడా మిగతా ఇండస్ట్రీల చిత్రాలు అందుకోలేని స్థాయిలో ఉండేవి. సౌత్ సినిమాలను నార్త్ వాళ్లు చాలా తక్కువగా చూసేవాళ్లు. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. దక్షిణాది సినిమాలు పాన్ ఇండియా స్థాయిలో అదరగొడుతున్నాయి. బాలీవుడ్ చిత్రాలేమో తేలిపోతున్నాయి. ఈ నేపథ్యంలో ఒక వేడుకలో లెజెండరీ రైటర్ జావెద్ అక్తర్.. ఆమిర్‌ ఖాన్‌కు ఒక ఆసక్తికర ప్రశ్న వేశారు. ముక్కూ మొహం తెలియని దక్షిణాది హీరోల సినిమాలు ఉత్తరాదిన వందల కోట్ల వసూళ్లు రాబడుతున్నాయని.. అదే సమయంలో బాలీవుడ్ చిత్రాలు వెనుకబడుతున్నాయని.. దీనికి కారణం ఏంటని ఆమిర్‌ను జావెద్ ప్రశ్నించారు. దీనికి ఆమిర్ సమాధానం ఇచ్చే ప్రయత్నం చేశారు.

ఏ సినిమా ఎక్కడిది అనేది పెద్ద విషయం కాదని ఆమిర్ అన్నాడు. దక్షిణాది, ఉత్తరాది అనే తేడాలు అనవసరమని ఆమిర్ అభిప్రాయపడ్డాడు. ఓటీటీలే బాలీవుడ్ వెనుకబడడానికి ప్రధాన కారణం అన్నట్లుగా ఆమిర్ మాట్లాడాడు. ‘‘దయచేసి థియేటర్‌కు వచ్చి మా సినిమా చూడండి అని అభ్యర్థిస్తాం. ఒకవేళ ప్రేక్షకులు థియేటర్లకు రాకపోతే 8 వారాల తర్వాత మనమే తీసుకెళ్లి ఇంట్లో ఆ సినిమా చూపిస్తాం. ఓటీటీ సబ్‌స్క్రిప్షన్ తీసుకున్న ప్రేక్షకులు కొన్ని వారాల తర్వాత ఎంచక్కా టీవీలో సినిమా చూస్తున్నారు. ఒకే ఉత్పత్తిని రెండుసార్లు ఎలా విక్రయించాలో నాకు తెలియదు.

ఓటీటీలు లేనపుడు ప్రేక్షకులు థియేటర్లకే వచ్చి సినిమా చూసేవాళ్లు. కానీ ఇప్పుడు ఎంతో నచ్చితే తప్ప థియేటర్లకు రావట్లేదు. మనం ఎక్కడి నుంచైనా సినిమా చూడొచ్చు అనే ఆప్షన్ ఉంది. ఈ బిజినెస్ మోడల్‌తో మన సినిమాలను మనమే చంపుకుంటున్నాం. హిందీ చిత్రాల దర్వకులు మరింత ఎక్కువ మెరుగులు దిద్దాలనే ఉద్దేశంతో మూలాలను మరిచిపోతున్నట్లు అనిపిస్తోంది. ఎమోషన్లను మిళితం చేయలేకపోతున్నాం. జీవితంలోని వివిధ కోణాలను మనం స్పృశించాలి’’ అని ఆమిర్ పేర్కొన్నాడు.