ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్ నిన్న రాత్రి నుంచి గాల్లో తేలిపోతున్నారు. న్యూజిలాండ్ చేతిలో టెస్టు సిరీస్‌లో వైట్ వాష్, బోర్డర్-గావస్కర్ ట్రోఫీలో ఆస్ట్రేలియా చేతిలో ఓటమితో కొన్ని నెలల ముందు వరకు తీవ్ర ఇబ్బందికర స్థితిలో ఉన్న భారత క్రికెట్ జట్టు.. ఇప్పుడు తిరుగులేని ఆధిపత్యంతో ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచి ఆ చేదు జ్ఞాపకాలన్నింటినీ చెరిపేసింది. ఈ టోర్నీలో భారత్ జోరు మామూలుగా సాగలేదు. ఒక్కటంటే ఒక్క మ్యాచ్ కూడా ఓడకుండా కప్పును ఒడిసిపట్టింది టీమ్ ఇండియా. దీంతో దేశమంతా సంబరాలు నెలకొన్నాయి.
ఇండియా ఇంత జోష్‌లో ఉంటే.. అటు పాకిస్థాన్ బాధ అంతా ఇంతా కాదు. ఆ దేశంలో 29 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత జరిగిన ఐసీసీ టోర్నీ ఇదే. 1996 వన్డే ప్రపంచకప్‌కు ఆతిథ్యమిచ్చాక పాక్‌లో ఒక్క ఐసీసీ టోర్నీ కూడా జరగలేదు. 2008 ముంబయి దాడుల తర్వాత భారత జట్టు ఆ దేశంలో పర్యటించనే లేదు. అదే సమయంలో శ్రీలకం జట్టుపై ఉగ్ర దాడి తర్వాత ఇతర దేశాలూ పాక్‌లో పర్యటించడం మానేశాయి. దీంతో పాకిస్థాన్‌లో ఐసీసీ టోర్నీలకూ బ్రేక్ పడింది. ఐతే ఎట్టకేలకు తమ దేశంలో ఐసీసీ టోర్నీ జరుగుతోందని పాక్ ఎంతో సంబరపడింది. కానీ ఆ దేశంలో పర్యటించేది లేదని భారత్ తెగేసి చెప్పడంతో తన మ్యాచ్‌లకు దుబాయిని వేదికగా చేసింది ఐసీసీ.
దీంతో ఆతిథ్యం తమదే అయినా.. భారత్‌తో తాము ఆడాల్సిన మ్యాచ్ కోసం దుబాయ్‌కే వచ్చింది పాక్. ఇదిలా ఉంటే గ్రూప్ దశలో వరుసగా రెండు మ్యాచ్‌లు ఓడి పాక్ టోర్నీ నుంచి ముందే నిష్క్రమించడంతో ఆ దేశం ఆనందమంతా ఆవిరైపోయింది. ఆ బాధ చాలదన్నట్లు భారత జట్టు వరుస విజయాలతో ఫైనల్‌కు దూసుకెళ్లింది. దీంతో ఒక సెమీస్ మ్యాచ్‌కు దుబాయే వేదిక అయింది. భారత్ సెమీస్ ఓడిపోతే.. ఫైనల్ అయినా తమ దేశంలో నిర్వహించుకునే అవకాశం పాకిస్థాన్‌కు ఉండేది. కానీ ఆ ఆశా తీరలేదు. భారత్ ఫైనల్ చేరడంతో ఆ మ్యాచ్ సైతం దుబాయ్‌లోనే జరిగింది.
ఈ మ్యాచ్‌లోనూ గెలిచి భారత్ కప్పు అందుకుంది. ఇది పాక్‌కు మరింత బాధ కలిగించే విషయం. ఆతిథ్య దేశం అయినప్పటికీ బహుమతి ప్రదానోత్సవంలో పాక్ ప్రాతినిధ్యమే లేకపోయింది. భారత్‌కు కప్పు అందించడం ఇష్టం లేక పాక్ బోర్డు నుంచి ఒక్కరూ ఆ వేడుకలో పాల్గొనలేదు. ఇన్నేళ్ల తర్వాత ఐసీసీ టోర్నీకి ఆతిథ్యం ఇస్తున్నామని ఛాంపియన్స్ ట్రోఫీ మొదలైనపుడు ఎంతో సంబరపడ్డ పాకిస్థానీలు.. టోర్నీకి ఇలాంటి ముగింపు ఉంటుందని అస్సలు ఊహించి ఉండరు.