సీనియర్ స్టార్ హీరోలను ఇలా సెలెబ్రేట్ చేసుకోవాలి

పరిశ్రమను కొత్త పుంతలు తొక్కిస్తూ హీరోయిజంకి న్యూ ఏజ్ డెఫినిషన్ రాస్తున్న సీనియర్ స్టార్ హీరోలను సందర్భానుసారంగా గౌరవించుకోవడం అందరి బాధ్యత. ఈ విషయంలో అమీర్ ఖాన్ అదృష్టవంతుడని చెప్పాలి. అరవై పడిలో అడుగు పెడుతున్న సందర్భంగా మార్చి 14 నుంచి 27 దాకా రెండు వారాల పాటు ఆయన ఫిలిం ఫెస్టివల్ ని ఘనంగా నిర్వహించబోతున్నారు. పివిఆర్ ఐనాక్స్ ప్రదర్శించబోతున్న ఈ చిత్రోత్సవంలో అమీర్ నటించిన ఎన్నో బ్లాక్ బస్టర్స్, క్లాసిక్స్ ని సరికొత్త రీ మాస్టర్ వెర్షన్ తో దేశమంతా షోలు వేస్తున్నారు. దీని కోసం ప్రత్యేకంగా ప్రమోషన్లు కూడా జరుగుతున్నాయి.

డెబ్యూ మూవీ ఖయామత్ సే ఖయామత్ తక్ తో మొదలుపెట్టి బ్రేక్ ఇచ్చిన దిల్, జో జీతా వహీ సికందర్ తో కొనసాగించి రాజా హిందూస్థానీ, హం హై రాహీ ప్యార్ కే, అకేలే హమ్ అకేలే తుమ్, అందాజ్ అప్నా అప్నా, గులామ్, సర్ఫరోష్, రంగ్ దే బసంతి, లగాన్, సీక్రెట్ సూపర్ స్టార్, దంగల్, దిల్ చాతా హై, ఫనా, తలాష్, ధూమ్ 3, గజినీ, లాల్ సింగ్ చద్దా, తారే జమీన్ పర్ లాంటి ఎన్నో సినిమాలు ఈ ఫెస్టివల్ లో ఉంటాయి. టైమింగ్స్, బుకింగ్స్ అన్నీ ముందస్తుగానే ప్రకటిస్తారు. పలు నగరాల్లో టికెట్ల అమ్మకాలు మొదలైపోయాయి. అమీర్ ఖాన్ వీరాభిమానులకు ఈ నెల పెద్ద ఖర్చే ఉండబోతోంది.

ఇది ఎందుకు ప్రస్తావించాల్సి వచ్చిందంటే ఆరు పదులు దాటిన, దాటబోతున్న సీనియర్ స్టార్లు, హీరోలు మన దగ్గరా ఉన్నారు. చిరంజీవి, బాలకృష్ణ వందకు పైగా సినిమాలతో తిరుగులేని ప్రస్థానం కొనసాగిస్తున్నారు. సెంచరీకి దగ్గర్లో నాగార్జున, డెబ్భై అయిదు పూర్తి చేసుకున్న వెంకటేష్ ఇచ్చిన ఆణిముత్యాలు ఎన్నో. వీళ్ళకు కూడా ఇలాంటివి ప్లాన్ చేస్తే కొత్త తరానికి వాళ్ళ కష్టం, డెడికేషన్ మరింత బాగా అర్థమవుతుంది. రాజేంద్రప్రసాద్, నరేష్ లాంటి వాళ్ళు సైతం ఈ గౌరవానికి అర్హులే. ఆ మధ్య ఏఎన్ఆర్ శతజయంతికి చేశారు కానీ సజీవంగా ఉన్నప్పుడు సెలెబ్రేషన్స్ జరిగితే ఆ ఆనందం చాలా ప్రత్యేకంగా ఉంటుంది.