కన్నప్ప వ్యూహాన్ని మారుస్తున్న విష్ణు

కన్నప్ప విడుదలకు ఇంకో నలభై మూడు రోజులు ఉంది. మంచు విష్ణు చాలా ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ ఆధ్యాత్మిక ప్యాన్ ఇండియా మూవీ నుంచి ఇప్పటి దాకా వచ్చిన రెండు పాటలు పాజిటివ్ రెస్పాన్స్ తెచ్చుకున్నాయి. సంగీత దర్శకుడు స్టీఫెన్ దేవస్సి మనకు కొత్తే అయినప్పటికీ మ్యూజిక్ లవర్స్ కు వేగంగా కనెక్టయిపోయాడు. మిగిలినవి కూడా ఇంతకన్నా పెద్ద స్థాయిలో ఉంటాయని ఇన్ సైడ్ టాక్. అయితే కన్నప్ప గురించి ఒక ఆసక్తికరమైన టాక్ ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. థియేట్రికల్ బిజినెస్, ఓటిటి, శాటిలైట్ ఇంకా క్లోజ్ చేయలేదట. కారణం విష్ణు వీటి ద్వారా భారీ మొత్తాన్ని ఆశించడమే అంటున్నారు.

తన వ్యక్తిగత ఇమేజ్ మీద కాకుండా కంటెంట్ మీద నమ్మకం, మల్టీస్టారర్ క్యాస్టింగ్, పోస్ట్ ప్రొడక్షన్ లో చూసుకున్న రషెస్ ఇవన్నీ విష్ణుకి బోలెడు నమ్మకం కలిగించాయట. అందుకే తొందరపడి తక్కువ రేట్లకు అమ్మడం కన్నా ట్రైలర్ రిలీజయ్యాక వచ్చే హైప్ ని బట్టి బయ్యర్లు వాళ్లే అధిక ధరలు ఆఫర్ చేస్తారనే కాన్ఫిడెన్స్ ఆయనలో ఉందట. మొన్నటి దాకా ట్రోలింగ్ కు టార్గెట్ గా ఉన్న కన్నప్ప మీద క్రమంగా ఆ ముద్ర పక్కకెళ్లింది. క్రమంగా పాజిటివ్ బజ్ ఏర్పడుతోంది. టీజర్ లో ప్రభాస్ తో సహా క్యాస్టింగ్ మొత్తాన్ని రివీల్ చేయడం సోషల్ మీడియాలో హైప్ తీసుకొచ్చింది. ఇదంతా శుభ శకునాలే.

కాకపోతే అసలైన సవాల్ ఇక ముందుంది. ఈ వేడిని ఇలాగే కొనసాగించేలా పబ్లిసిటీ ప్లాన్ చేసుకోవాలి. శ్రీకాళహస్తిలో ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం విష్ణు ప్రయత్నాలు చేస్తున్నట్టు టాక్. టీమ్ మొత్తాన్ని ఈ వేడుక కోసం తీసుకురావాలని చూస్తున్నాడట. అయితే ప్రభాస్ డేట్ తో పాటు మిగిలిన ఆర్టిస్టుల డేట్లు సింక్ అవ్వాలి. అప్పుడే అందరి హాజరు కుదురుతుంది. మోహన్ లాల్, అక్షయ్ కుమార్, శరత్ కుమార్ ఇలా అందరూ సీనియర్ క్యాస్టింగే ఉన్నారు. ఒకే తాటిపైకి వచ్చే తేదీ సెట్ చేయాలి. ఇక ఏప్రిల్ నెలలోనూ హరిహర వీరమల్లు వచ్చే అవకాశాలు తగ్గిపోవడంతో సరిగా ప్రమోట్ చేసుకుంటే కన్నప్పకు నార్త్ లోనూ మద్దతు దొరుకుతుంది.