టాలీవుడ్ బడా నిర్మాత, తెలంగాణ ఫిల్మ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు ఇల్లు, కార్యాలయాలపై ఐటీ సోదాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. మంగళవారం తెల్లవారకముందే… దిల్ రాజు ఇల్లు, ఆఫీస్ ల ముందు ప్రత్యక్షమైన ఐటీ అదికారులు… నగరంలోని 8 ప్రాంతాల్లో సోదాలను మొదలుపెట్టారు. ఈ సోదాలు దిల్ రాజు ఇల్లు, కార్యాలయాలతో పాటుగా ఆయన కుమార్తె హన్షిత రెడ్డి, సోదరుడు శిరీష్ ఇల్లు, కార్యాలయాల్లోనూ జరుగుతున్నాయి. బంజారా హిల్స్ , జూబ్లీ హిల్స్, కొండాపూర్, గచ్చిబౌలి తదితర ప్రాంతాల్లో ఏకకాలంలో ఈ సోదాలు మొదలయ్యాయి.
ఇదిలా ఉంటే… జూబ్లీ హిల్స్ లోని దిల్ రాజు ఇంటిలో సోదాలు చేస్తున్న ఐటీ అధికారులు ఓ కీలక అడుగు వేశారు. దిల్ రాజుకు చెందిన శ్రీ వేంకటేశ్వర సినీ చిత్రకు సంబంధించిన ఆడిట్ రిపోర్టులతో పాటుగా బ్యాలెన్స్ షీట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా దిల్ రాజు సతీమణి తేజస్విని ఐటీ అధికారులు కొంత సేపు ప్రశ్నించారు. ఆ తర్వాత ఆమెను తమ వెంట రమ్మంటూ ఐటీ అదికారులు ఆదేశాలు జారీ చేశారు. దీంతో దిల్ రాజు ఫ్యామిలీ షాక్ తిన్నది. దీంతో మరిన్ని వివరాలు వెల్లడించిన ఐటీ అదికారులు..బ్యాంకు లాకర్లను పరిశీలించాల్సి ఉందని, ఇందుకోసం తేజస్విని తమ వెంట పంపాలంటూ దిల్ రాజును కోరారు. అందుకు దిల్ రాజు ఒప్పుకోవడంతో తేజస్వినిని వెంటబెట్టుకుని ఐటీ అధికారులు బ్యాంకుకు వెళ్లారు.
ఈ సమయంలో దిల్ రాజు ఇంటి బయటే ఉన్న మీడియా ప్రతినిధులు తేజస్విని వద్ద నుంచి వివరాలు రాబట్టేందుకు యత్నించారు. ఐటీ దాడులు సాదారణంగానే జరుగుతున్నాయని, ఇందులో పెద్దగా ఆశ్చర్యమేమీ లేదని తేజస్విని చెప్పారు. అంతేకాకుండా రోటీన్ గానే ఈ సోదాలు జరుగుతున్నాయని చెప్పే యత్నం చేశారు. అయితే ఐటీ అధికారుల వెంట ఎక్కడికి వెళుతున్నారంటూ మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా… బ్యాంకు లాకర్లను పరిశీలించాలని అధికారులు కోరారని, అందుకోసమే వారితో వెళుతున్నట్లు చెప్పారు. బ్యాంకు లాకర్లను పరిశీలించేదాకా విషయం వచ్చిందంటే… దిల్ రాజు ఇంటిలో ఐటీ సోదాలు కాస్తంత గట్టిగానే సాగుతున్నాయన్న వాదనలు వినిపిస్తున్నాయి. బ్యాంకు లాకర్ల పరిశీలన తర్వాత తేజస్వినిని తిరిగి ఐటీ అదికారులు దిల్ రాజు ఇంటికి తీసుకెళ్లారు.