సంక్రాంతికి వస్తున్నాం – చదవాల్సిన కేస్ స్టడీ

టాలీవుడ్ కు అత్యంత కీలకమైన సంక్రాంతి పండగ అయిపోయింది. నిన్నటితో సెలవులు పూర్తయిపోయాయి. బాక్సాఫీస్ విజేతగా ఒక్క శాతం అనుమానం లేకుండా సంక్రాంతికి వస్తున్నాం కిరీటం అందుకుంది. పోటీ సినిమాలతో పోల్చుకుంటే తక్కువ బడ్జెట్, బిజినెస్ తో చివరిలో రిలీజై ఇది సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు.

అందుకే పరిశీలకులు దీన్నో కేస్ స్టడీగా చూస్తున్నారు. కమర్షియల్ హంగులు లేకుండా కేవలం ఎంటర్ టైన్మెంట్ ని నమ్ముకుని వారం తిరక్కుండానే రెండు వందల కోట్ల గ్రాస్ కు దగ్గరగా వెళ్ళడమంటే మాటలు కాదు. ఇది టయర్ వన్ స్టార్లకు సైతం అంత సులభమైన ఫీట్ కాదు.

ఇక్కడ ప్రధానంగా గమనించాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి. ప్రేక్షకులు మనసారా నవ్వుకునే వినోదానికి మొహం వాచిపోయి ఉన్నారు. పుష్ప 2, దేవర, కల్కి, హనుమాన్ వందల కోట్లు వసూలు చేసిన బ్లాక్ బస్టర్లే. కానీ వీటిలో ఎలివేషన్లు, యాక్షన్లు, ఫాంటసీలు ఎక్కువ. ఎంటర్ టైన్మెంట్ తక్కువ.

రోమాలు నిక్కబొడుచుకునే ఎపిసోడ్స్ ఉంటాయి కానీ కుర్చీలో లేస్తూ పడుతూ ఎంజాయ్ చేసే కామెడీ ఉండదు. దాన్నే దర్శకుడు అనిల్ రావిపూడి ఒడిసి పట్టుకున్నాడు. ఫ్యామిలీ మొత్తం టికెట్లు కొంటే బయటికి వస్తున్నప్పుడు వాళ్ళను ఎలా సంతృప్తి పరచాలా అనే దాని మీదే దృష్టి పెట్టాడు. దాన్నే కథగా రాసుకున్నడు.

వెంకటేష్ లాంటి టైమింగ్ ఉన్న హీరో దొరికితే ఇక చెప్పేదేముంది. ఆర్టిస్టుల ఎంపికలో తీసుకున్న శ్రద్ధ గొప్ప ఫలితాన్ని ఇచ్చింది. జనసేన క్యాంపైన్ లో తిరిగిన చైల్డ్ ఆర్టిస్టు రేవంత్ భీమలని తీసుకోవడం కన్నా అద్భుతమైన ఎత్తుగడ మరొకటి ఉండదు. హీరోయిన్ గా ఐశ్వర్య రాజేష్ ని ఎంచుకోవడం పర్ఫెక్ట్ ఛాయస్ అనిపించుకుంది.

ఒకవేళ తెలుగు రాని బాలీవుడ్ అమ్మాయిని తీసుకుని ఉంటే గోదావరి స్లాంగ్ ఇంత బాగా పండేది కాదు. ఫామ్ లో ఉన్న మీనాక్షి చౌదరిని మాజీ ప్రియురాలిగా ఎంచుకోవడం ట్రెండ్ తో కనెక్ట్ అయ్యేలా చేసింది. ఉపేంద్ర లిమయే కొంచెం ఓవర్ బోర్డ్ అనిపించినా అతనూ జనాలను ఘొల్లుమని నవ్వించాడు.

ఇక పాటల విషయంలో భీమ్స్, అనిల్ తీసుకున్న శ్రద్ధ ఛార్ట్ బస్టర్ ఆల్బమ్ రూపంలో రిలీజ్ కు ముందే గ్యారెంటీ ఓపెనింగ్స్ ఇచ్చింది. నిర్మాత దిల్ రాజు సంక్రాంతికి వస్తున్నాంకి కళ్లుచెదిరేలా ఖర్చు పెట్టలేదు. డింగ్ డింగ్ పాటలో తప్ప అవుట్ డోర్ ఉండదు. చాలా ప్లాన్డ్ గా బడ్జెట్ వేసుకున్నారు.

అది కొన్ని ఫ్రేమ్స్ లో రాజీపడిన ధోరణిని బయటపెట్టింది. అయినా సరే పబ్లిక్ పట్టించుకోలేదంటే ఎంగేజ్ చేయడంలో అనిల్ రావిపూడి సాధించిన విజయం తప్ప మరొకటి కాదు. సో హంగులు ఆర్భాటాలు లేకపోయినా సరైన ఎంటర్ టైన్మెంట్ ఉంటే బ్రహ్మరథం దక్కుతుందని నిరూపించిన సంక్రాంతికి వస్తున్నాం కన్నా గొప్ప సక్సెస్ కేస్ స్టడీ ఏముంటుంది.