గేమ్ ఛేంజర్ గురించి పాజిటివ్ రివ్యూలు చూశానని దర్శకుడు శంకర్ పైకి చెబుతన్నారు కానీ ఫలితం ఏమిటనేది బాక్సాఫీస్ వసూళ్ల సాక్షిగా కనిపిస్తోంది. ఇండియన్ 2 అంత దారుణంగా లేకపోయినా ఆశించిన స్థాయిలో పెర్ఫార్మ్ చేయడం లేదనేది వాస్తవం.
ఇదిలా ఉండగా ఇటీవల ఒక ఇంటర్వ్యూలో శంకర్ మాట్లాడుతూ గేమ్ ఛేంజర్ మొత్తం నిడివి 5 గంటలు వచ్చిందని, ఎడిటింగ్ లో భాగంగా ముఖ్యమైన సన్నివేశాలు కొన్ని తీసేయాల్సి వచ్చిందని, దాని వల్ల ప్రభావం తగ్గిందని అన్నారు. ఒకవేళ అవి ఉంటే కనక మరింత బెటర్ అవుట్ ఫుట్ అయ్యుండేదని అభిప్రాయపడ్డారు. ఇక్కడే లాజిక్ మిస్ అవుతోంది.
కంటెంట్ బలంగా ఉంటే జనాలు నిడివిని లెక్క చేయరని పుష్ప 2 ది రూల్ నిరూపించింది. మూడు గంటల ఇరవై నిమిషాల పాటు కదలకుండా చూశారు. ఫలితమే ప్రపంచవ్యాప్తంగా రెండు వేల కోట్లకు దగ్గరగా వసూళ్లు. యానిమల్ కూడా ఇంతే లెన్త్ తో వచ్చినప్పుడు చాలా కామెంట్లు వచ్చాయి.
చూస్తే తెలుగు తమిళంలోనూ దాని డబ్బింగ్ వెర్షన్ విరగబడి ఆడింది. ఈ రెండు కేవలం ఏడాది గ్యాప్ లో వచ్చిన ఆల్ టైం ఇండస్ట్రీ హిట్లు. మరి శంకర్ చెప్పిన ప్రకారం నిజంగా గొప్ప ఫుటేజ్ ఉండి అది కూడా జోడించి ఉంటే గేమ్ ఛేంజర్ ఫలితం మారేదిగా. అంటే అనవసరమైనవే పక్కన పెట్టి ఉంటారుగా.
ఇక్కడ ఇంకో కోణం ఉంది. అంత ఫుటేజ్ తీయడానికి ఎన్ని కోట్లు వృథా అయ్యుంటాయి. స్క్రిప్ట్ దశలోనే ఇవి అవసరమో లేదో గుర్తించి ఉంటే ఆ మేరకు ఖర్చు ఆదా అయ్యేది కదా. కేవలం ఎడిటింగ్ వల్ల సినిమా ఆడలేదని చెప్పడం తర్కానికి అందదు. ఆ మాటకొస్తే పుష్ప 2 కి ఇంకో ఇరవై నిముషాలు జోడించి జనవరి 17 నుంచి కొత్త వెర్షన్ రిలీజ్ చేస్తున్నారు.
అయినా సరే చూసేందుకు ప్రేక్షకులు రెడీ అవుతున్నారు. అంటే వాళ్ళను ఎగ్జైట్ చేయగలిగితే నాలుగు గంటలు థియేటర్లో గడిపేందుకు సిద్ధంగా ఉన్నామని చెబుతున్నట్టేగా. అలాంటప్పుడు శంకర్ చెబుతున్న అయిదు గంటల ఆన్సర్ కి వెయిట్ ఎక్కడిది.