సినిమాల షూటింగ్ సందర్భంగా స్టార్ హీరోలకు అన్నీ కంఫర్టబుల్‌గా ఉండేలా చూసకుంటారు నిర్మాతలు. వాళ్ల వీలును బట్టే షూటింగ్స్ ఉంటాయి. మిగతా ఆర్టిస్టుల డేట్లను కూడా అందుకు తగ్గట్లే సర్దుబాటు చేస్తారు. స్టార్లు సాధారణంగా ఒక సమయంలో ఒకే సినిమా చేస్తుంటారు కాబట్టి వాళ్లకు పెద్ద ఇబ్బంది కూడా ఉండదు. కానీ హీరోయిన్లు, మిగతా ఆర్టిస్టుల పరిస్థఇతి ఇలా ఉండదు.
వాళ్లు ఒకే సమయంలో వేర్వేరు చిత్రాల్లో నటిస్తుంటారు. ఆయా సినిమాలకు తగ్గట్లు డేట్లు సర్దుబాట్లు చేసుకోవాలి. కొన్నిసార్లు ఒకే రోజు రెండు మూడు సినిమాల షూటింగ్‌ల్లోనూ పాల్గొనాలి. రెండు మూడు షిఫ్టుల్లోనూ పని చేయాలి. ఐతే ఒకే సిటీలో షూట్ అంటే ఓకే కానీ.. వేర్వేరు చోట్ల చిత్రీకరణ అంటే ఇబ్బంది తప్పదు.
తెలుగులో బిజీ హీరోయిన్‌గా ఉన్న బాలీవుడ్ భామ నిధి అగర్వాల్ ఇప్పుడు ఇలాంటి ఇబ్బందే ఎదుర్కొంటోంది. ఒకేసారి పవన్ కళ్యాణ్ చిత్రం ‘హరిహర వీరమల్లు’, ప్రభాస్ మూవీ ‘రాజాసాబ్’ లో నటిస్తోందామె. ఈ రెండు చిత్రాల షూటింగ్ కోసం తాను ఎంత కష్టపడుతోందో ఆమె ఒక ఇంటర్వ్యూలో వెల్లడించింది.
‘‘పవన్ కళ్యాణ్, ప్రభాస్‌ల సినిమాల్లో ఒకేసారి నటించడం నా అదృష్టం. అందుకోసం ఎంత కష్టమైనా పడడానికి సిద్ధం. ‘హరిహర వీరమల్లు’ సినిమా షూట్ విజయవాడలో చేస్తున్నారు. నేను ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఆ సినిమా షూట్‌లో పాల్గొంటున్నా. మధ్యాహ్నం 2-3 మధ్య ఫ్లైట్ ఎక్కి హైదరాబాద్ వస్తున్నా. అక్కడ సాయంత్రం నాలుగు గంటల నుంచి రాత్రి 10-11 వరకు ‘రాజాసాబ్’ షూటింగ్ జరుగుతోంది. అప్పుడు నేను మళ్లీ కార్లో విజయవాడకు బయల్దేరుతున్నా. నా నిద్ర కార్లోనే పూర్తి చేస్తున్నా.
తెల్లవారుజామున వీలుంటే కొంతసేపు నిద్రపోవడం.. లేదంటే నేరుగా షూట్‌కు వెళ్లిపోవడం. మళ్లీ ఉదయం నుంచి పవన్ గారి సినిమా షూట్‌లో పాల్గొంటున్నా. ఇలా తీరిక లేకుండా పని చేస్తున్నా అలసటకు గురి కావట్లేదు. ఆ రెండు సినిమాల విషయంలో నాకు అంత ఉత్సాహంగా ఉంటోంది’’ అని నిధి చెప్పింది.