ఒకప్పుడు తెలుగు తమిళ సినిమాలను కొనే విషయంలో అలసత్వం ప్రదర్శించడం ఎంత పెద్ద తప్పో ఆర్ఆర్ఆర్ తర్వాత గుర్తించిన నెట్ ఫ్లిక్స్ గత రెండేళ్లుగా స్ట్రాటజీని మార్చి వందల కోట్ల పెట్టుబడులను టాలీవుడ్ హక్కుల కోసం కుమ్మరిస్తోంది. మొన్నటిదాకా మార్కెట్ లో ఆధిపత్యం ప్రదర్శించిన అమెజాన్ ప్రైమ్ ని వెనుకబడేలా చేస్తున్న నెట్ ఫ్లిక్స్ స్ట్రాటజీలు మాములుగా లేవు.
తాజాగా పండగ పేరుతో ఈ ఏడాది థియేటర్లలో రిలీజైన తర్వాత తమ ఓటిటిలో రాబోతున్న భారీ చిత్రాల లిస్టును అధికారికంగా ప్రకటించింది. చూచాయగా లెక్కేసుకున్నా వీటి విలువ వెయ్యి కోట్లు దాటినా ఆశ్చర్యం లేదు.
వాటిలో ప్రధానంగా చెప్పుకోవాల్సింది పవన్ కల్యాణ్ ‘ఓజి’ గురించి. ఇప్పటికే విపరీతమైన హైప్ తో మంత్రంలా జపిస్తున్న ఈ మూవీ కోసం అభిమానులు కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారని చెప్పడం చిన్న మాటే అవుతుంది.
గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రూపొందుతున్న ఇంకా టైటిల్ నిర్ణయించని ‘విజయ్ దేవరకొండ 12’ నెట్ ఫ్లిక్స్ కే సొంతమయ్యింది. న్యాచురల్ నాని ‘హిట్ 3 ది థర్డ్ కేస్’ తో పాటు నాగ చైతన్య సాయిపల్లవిల ‘తండేల్’ సైతం ఇందులోనే రానుంది.
భాను భోగవరపుని దర్శకుడిగా పరిచయం చేస్తున్న రవితేజ ‘మాస్ జాతర’ని ఇదే ప్లాట్ ఫార్మ్ మీద వేసవి సీజన్ లో చూడొచ్చు.
నవీన్ పోలిశెట్టి, మీనాక్షి చౌదరి కాంబోలో రూపొందిన ‘అనగనగా ఒక రాజు’ మీద మంచి బజ్ ఉంది. నాని నిర్మాతగా ప్రియదర్శి ప్రధాన పాత్ర పోషించిన ‘కోర్ట్’ సీరియస్ బ్యాక్ డ్రాప్ లో రానుంది. మొదటి భాగంతో యూత్ ని కట్టిపడేసిన సూపర్ హిట్ కి సీక్వెల్ గా ‘మ్యాడ్ స్క్వేర్’ని సిద్ధం చేస్తున్నారు.
సిద్దు జొన్నలగడ్డ, బొమ్మరిల్లు భాస్కర్ ‘జాక్’ మీద బిజినెస్ క్రేజ్ భారీగా ఉంది. ఇవన్నీ నెట్ ఫ్లిక్స్ ఖాతాలోనే చేరబోతున్నాయి. సితార ఎంటర్ టైన్మెంట్స్ వి వీటిలో నాలుగు ఉండటం గమనార్షం. ఓటిటిల పోటీ వాతావరణంలో ప్రేక్షకులు కడుతున్న భారీ చందాకు న్యాయం జరగాలంటే ఇలాంటి సినిమాలే ఇవ్వాలి మరి.