ఎంత గొప్ప దర్శకుడైనా ఒక దశ దాటాక ఔట్ డేట్ అయిపోవడం.. ఫెయిల్యూర్లు ఎదుర్కోవడం.. సినిమాలు సరిగా ఆడక ఇబ్బంది పడడం మామూలే. మార్కెట్ లేని పరిస్థితుల్లో కెరీర్ ముగించడం కూడా సహజమే. కానీ ఒక దర్శకుడు ఇంకా ఫామ్‌లోనే ఉండగా.. బ్లాక్ బస్టర్లు కొట్టగల సామర్థ్యానికి ఢోకా లేకపోయినా సినిమాలు తీయలేని, తీసినా విడుదల చేసుకోలేని స్థితిలో ఉండడం విచారకరమైన విషయం.
తమిళ గ్రేట్ డైరెక్టర్ గౌతమ్ మీనన్ ఇప్పుడు ఇలాంటి పరిస్థితిలోనే ఉన్నాడు. చెలి, కాక్క కాక్క, ఏమాయ చేసావె, వేట్టయాడు విలయాడు లాంటి మరపురాని చిత్రాలను అందించిన ఈ దర్శకుడు.. చాలా ఏళ్ల నుంచి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. తన ప్రొడక్షన్ హౌస్ ‘ఫాంటమ్ ఫిలిమ్స్’ ఆర్థిక సంక్షోభంలో చిక్కుకోవడమే అందుక్కారణం.
దీని వల్ల గౌతమ్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించిన, ప్రొడ్యూస్ చేసిన చిత్రాలు ఇబ్బందుల్లో పడ్డాయి. పెండింగ్‌లో పడ్డ ఒక్కో చిత్రాన్ని బయటికి తీసుకొచ్చే ప్రయత్నాలు చేశాడు కానీ.. విక్రమ్ హీరోగా చేసిన ‘ధృవ నక్షత్రం’ మాత్రం మరుగునే ఉండిపోయింది. ఈ చిత్రాన్ని రిలీజ్ చేయడానికి కొన్నేళ్ల నుంచి గౌతమ్ చేస్తున్న ప్రయత్నాలేవీ ఫలించడం లేదు.
చాలామందితో చర్చలు జరుపుతున్నాడు. సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తున్నాడు. కానీ తీరా రిలీజ్ దగ్గర పడేసరికి సినిమాకు మోక్షం కలగట్లేదు. గత ఏడాది నవంబరులో రిలీజ్ అనౌన్స్ చేసి వెనక్కి తగ్గాడు. ఈ నేపథ్యంలో గౌతమ్ చేసిన వ్యాఖ్యలు అతడి దయనీయ స్థితిని తెలియజేస్తున్నాయి.
‘‘నాకు ఇండస్ట్రీలో సాయం చేయడానికి ఎవ్వరూ లేరు. నమ్మడానికి కష్టంగా ఉన్నా ఇది నిజం. ‘ధృవనక్షత్రం’ విడుదల విషయంలో సమస్యల గురించి ఎవ్వరూ స్పందించలేదు. కనీసం ఏం జరుగుతోందో తెలుసుకోవడానికి కూడా ప్రయత్నించడం లేదు. ధనుష్, లింగుస్వామి మాత్రమే దాని గురించి అడిగారు. విడుదల చేయడానికి ప్రయత్నించారు.
కానీ కొన్ని స్టూడియోలకు సినిమాను చూపించాను. కొన్ని సమస్యల వల్ల వాళ్లు సినిమాను తీసుకోలేదు. ప్రేక్షకులు ఇంకా నా సినిమాలను చూడాలని కోరుకుంటున్నారు. కాబట్టే నేనింకా బతికి ఉన్నా’’ అని గౌతమ్ వ్యాఖ్యానించాడు. మరి ‘ధృవ నక్షత్రం’ సినిమాను ఎప్పుడు మోక్షం కలుగుతుందో.. గౌతమ్ కష్టాలు ఎప్పటికి తీరుతాయో చూడాలి.