పవన్ కళ్యాణ్ ప్రసంగం మీద ఫ్యాన్స్ అంచనాలు

ఈ రోజు సాయంత్రం జరగబోయే గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి రాజమండ్రి సిద్ధమయ్యింది. సుమారు లక్షన్నర మందికి సరిపడా ఏర్పాట్లతో ప్రభుత్వ యంత్రాంగంతో పాటు నిర్వాహకులు అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి అయ్యాక పవన్ కళ్యాణ్ పాల్గొంటున్న తొలి టాలీవుడ్ వేడుక ఇదే కావడంతో ఒక ప్యాన్ ఇండియా సినిమాకు సరిపడా హైప్ దీని మీద ఉంది. అందులోనూ బాబాయ్ అబ్బాయ్ ఒకే వేదికపై కలయికను రంగస్థలం తర్వాత చూసే అవకాశం దక్కడంతో అభిమానుల ఉద్వేగం మాములుగా లేదు. లైవ్ లోనూ కోట్లాది ప్రేక్షకులు చూడబోతున్నారు.

ఇప్పుడు అందరి దృష్టి పవన్ ఏమేం మాట్లాడతారనే దాని మీదే ఉంది. చరణ్, గేమ్ ఛేంజర్ లో ఉన్న సోషల్ మెసేజ్ గురించి చెప్పడంలో ఆశ్చర్యం ఏముండదు కానీ ఇటీవల టాలీవుడ్ లో జరిగిన పరిణామాలు, టికెట్ రేట్ల పెంపు, బెనిఫిట్ షోలు, మెగా ఫ్యామిలీ సంగతులు ఏమైనా ఉంటాయనే దాని మీద ఎక్కువ ఆసక్తి నెలకొంది. పైగా ఎక్కడికి వెళ్లినా పవర్ ఫాన్స్ ఓజి ఓజి అంటూ జపం చేస్తున్నారు. దానితో పాటు హరిహర వీరమల్లు ప్రస్తావన వచ్చే అవకాశాలు లేకపోలేదు. కీలకమైన ఉప పాలకుడి పాత్రలో ఉన్న పవన్ కళ్యాణ్ నుంచి ఎంతో కొంత పొలిటికల్ టచ్ లేకుండా స్పీచ్ ఊహించలేం.

భారీ జనసందోహం మధ్య జరుగుతున్న ఈ ఈవెంటే గేమ్ ఛేంజర్ ప్రమోషన్లలో అతి పెద్ద మజిలీ. ట్రైలర్ వచ్చాక అంచనాలు పెరగడంతో దిల్ రాజు బృందం ఈ వేడుక మీద చాలా ఆశలు పెట్టుకుంది. ఓపెనింగ్స్ మీద ప్రభావం ఉంటుందని ఆశిస్తోంది. మాములుగా సోలో రిలీజ్ అయితే టెన్షన్ తగ్గేది కానీ డాకు మహారాజ్, సంక్రాంతికి వస్తున్నాంలతో తలపడాల్సిన నేపథ్యంలో చరణ్ కు బాక్సాఫీస్ ఫైట్ గట్టిగానే ఉంటుంది. దర్శకుడు శంకర్, తమన్, అంజలి, ఎస్జె సూర్య తదితరులు చాలా కాన్ఫిడెంట్ గా బ్లాక్ బస్టరని చెబుతున్నారు. చూడాలి మరి రామ్ నందన్ వసూళ్ల వేట ఎలా ఉండబోతోందో.