పైరసీ రూపంలో కొత్త ప్రమాదం…జాగ్రత్త నిర్మాతలూ !

ఇండస్ట్రీని ఎప్పటి నుంచో పట్టి పీడిస్తున్న పైరసీ గురించి కొత్తగా చెప్పేందుకు ఏమి లేదు కానీ నిన్నా మొన్నటిదాకా ఇవి థియేటర్ ప్రింట్లకు పరిమితమైన సంగతి తెలిసిందే. అందుకే దీని ప్రభావం మరీ తీవ్రంగా ఉండదని భావించిన నిర్మాతలు సమస్యని అంత సీరియస్ గా తీసుకోలేదు. సౌండ్ సరిగా లేకపోవడం, మసక మసక స్పష్టత వల్ల వీటికి ఆదరణ తక్కువగానే ఉండేది. కానీ ఇప్పుడిది హెచ్డి రూపం సంతరించుకుంటోంది. కొత్త ప్రమాద ఘంటికలను మ్రోగిస్తోంది. రెండు మూడు వారాలు కాకుండానే లేటెస్ట్ రిలీజులను మంచి స్టీరియో సౌండ్, హెచ్డి క్వాలిటీతో బయటికి రావడం ఆందోళన రేకెత్తిస్తోంది.

ముఖ్యంగా తమిళ స్ట్రెయిట్ – డబ్బింగ్, హిందీ సినిమాలకు ఈ ముప్పు ఎక్కువగా కనిపిస్తోంది. వీటి బారిన పడిన లిస్టులో బేబీ జాన్, వన వాస్, తో పాటు విడుతలై పార్ట్ 2, బరోజ్, సూక్ష్మ దర్శిని, ఈడి ఎక్స్ ట్రా డీసెంట్, మార్కో, కంగువ లాంటివి ఉన్నాయి. ఇవి విస్తృతంగా అందుబాటులో లేకపోయినా పైరసీ సైట్లతో పరిచయమున్న వాళ్ళ ద్వారా వివిధ మార్గాల్లో త్వరగా బయటికి వెళ్లిపోతున్నాయి. పుష్ప 2 సైతం వీటి బారిన పడిందనే టాక్ ఉంది. ఏది ఏమైనా వీలైనంత త్వరగా నిర్మాతలు మేల్కొని కట్టడి చేయాల్సిన అవసరం చాలా ఉంది. ప్రభుత్వాల సహకారం కూడా ఈ విషయంలో చాలా అవసరం.

పరిశ్రమ వైపు నుంచి ఎన్ని విన్నపాలు వెళ్తున్నా దశాబ్దాల తరబడి ఇది పరిష్కారం కాని వలయంగా మారిపోయింది. ఆ మధ్య ఈటీవీ విన్ పైరసీని కట్టడి చేయడానికి కొత్త తరహా మార్గాలను వెతికింది. దాని ఫలితంగానే కిరణ్ అబ్బవరం క తమ ప్లాట్ ఫార్మ్ మీద ఒకటి రెండు రోజులు పైరసీ కాకుండా ఆపగలిగింది. కానీ ఇలాంటివి శాశ్వత పరిష్కారాలు కాకపోయినా కనీసం ఒకరంటూ మొదలుపెట్టారు కాబట్టి మరింత మెరుగుపరిచే విధంగా ఇతరులు కూడా చొరవ తీసుకోవాలి. లేకపోతే ఈ మహమ్మారి వేరే భాషలకు పాకే ప్రమాదముంది. ఇప్పటికే పైరసీ భూతం వల్ల సినీ పరిశ్రమ నష్టపోతున్న మొత్తం వేల కోట్లలో ఉంది.