ఇటీవల ఓ చర్చా వేదికలో హిందీ సినిమాల మీద తెలుగు చిత్రాల ఆధిపత్యం గురించి టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ నాగవంశీ చేసిన వ్యాఖ్యలపై బాలీవుడ్ మండి పడుతున్న సంగతి తెలిసిందే. ఈ వివాదం ఇలా నడుస్తుండగానే.. తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్ వ్యాఖ్యలపై బాలీవుడ్ దర్శక నిర్మాత అనురాగ్ కశ్యప్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఐతే శంకర్ ఏమీ బాలీవుడ్ సినిమాల గురించి ఏ వ్యాఖ్యలు చేయలేదు.
యుఎస్‌లో జరిగిన గేమ్ చేంజర్ ఈవెంట్లో ఆయన మాట్లాడుతూ.. ప్రేక్షకులు ప్రస్తుతం రీల్స్ ట్రెండుకు అలవాటు పడ్డారని, కాబట్టి తక్కువ నిడివిలో విషయం తెలుసుకోవాలనుకుంటున్నారని, దీన్ని దృష్టిలో ఉంచుకునే తాను గేమ్ చేంజర్ సినిమా తీశానని వ్యాఖ్యానించాడు. ఈ వ్యాఖ్యలను అనురాగ్ కశ్యప్ ఒక చర్చా వేదికలో తప్పుబట్టాడు. దర్శకుల తీరు ఒక్పటితో పోలిస్తే ఇప్పుడు మారిపోయిందని, అందుకే మంచి సినిమాలు రావట్లేదని కశ్యప్ అన్నాడు.
”శంకర్ వ్యాఖ్యల్లోని అర్థం నాకు తెలియదు. సినిమా విడుదలైతే ఆయన అలా ఎందుకు మాట్లాడారో పూర్తిగా అర్థం కావచ్చు. చాలామంది ఫిలిం మేకర్స్ ఇప్పుడు ఇలాగే మాట్లాడుతున్నారు. కొన్ని రీల్స్‌ను కలిపి సినిమా చేశామని, ప్రేక్షకులు ఇప్పుడు అదే కోరుకుంటున్నారని చెబుతున్నారు. కొత్త తరహా కథలతో వినూత్నమైన సినిమాలు తీస్తూ ఒకప్పుడు దర్శకులు వండే వారిలా కనిపించేవారు. కానీ ఇప్పుడు వాళ్లే వడ్డించే వారిలా మారారు. ప్రేక్షకులకు ఏం కావాలి అని ఆలోచించారంటే అక్కడే మీ పతనం మొదలైనట్లు.
అభిరుచి, పట్టుదల, ప్రేమతో మనం ఏదైనా స్క్రీన్ మీద పెడితే దాన్ని వీక్షించేందుకు ప్రేక్షకులు ఇష్టపడతారు. ఒకప్పుడు ఫిలిం మేకర్స్ పాటించిన ఇదే సిద్దాంతాన్ని నేను ఇప్పటికీ అనుసరిస్తున్నా. బాలీవుడ్ కూడా ఇప్పుడు మొత్తం మారిపోయింది. సినిమాను బిజినెస్ లాగా మార్చేశారు. దాని వల్ల ఫిలిం మేకింగ్‌ను ఆస్వాదించలేకపోతున్నా” అని అనురాగ్ అన్నాడు. బ్లాక్ ఫ్రైడే, గ్యాంగ్స్ ఆఫ్ వస్సీపూర్ లాంటి క్లాసిక్స్ తీసిన అనురాగ్ ఇప్పుడు ఫాంలో లేడు.