ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అధికారిక పర్యటనలు, కార్యక్రమాల సందర్భంగా ఆయన అభిమానులు సినిమాల గురించి నినాదాలు చేయడం చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. తాను ఉప ముఖ్యమంత్రి హోదాలో పాల్గొంటున్న కార్యక్రమాల్లో ఆ తరహా కేకలు వేయొద్దని అభిమానులను పవన్ వారించినా వినడం లేదు. ఈ క్రమంలోనే తాజాగా మీడియాతో చిట్ చాట్ నిర్వహించిన పవన్ కల్యాణ్ ఆ విషయంపై కీలక వ్యాఖ్యలు చేశారు.
ఓజీ..ఓజీ…అనేవి అరుపులు కాదని..అభిమానుల బెదిరింపులు అని పవన్ సరదాగా చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. తనను ఈ మధ్య అభిమానులు ఓజీ…ఓజీ అనే అరుపులతో బెదిరిస్తున్నారని పవన్ నవ్వుతూ చేసిన వ్యాఖ్యలు ఆ చిట్ చాట్ లో నవ్వులు పూయించాయి. మామూలుగా అయితే, ఓజీ అంటే ఒరిజినల్ గ్యాంగ్ స్టర్ అని…కానీ, ఈ సినిమాలో ఓజీ అంటే ఓజాస్ గంభీర్ అని పవన్ చెప్పారు. 1990లలో బాంబే బ్యాక్ డ్రాప్ లో జరిగే కథ అని అన్నారు.
తాను ఓజీ, హరిహరవీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రాల దర్శకనిర్మాతలకు క్లీయర్ గా ఒక టైం చెప్పానని, ఆ సమయం దాటితే తాను చేయలేనని చాలా క్లీయర్ కట్ గా చెప్పానని పవన్ అన్నారు. అయితే, తాను చెప్పిన సమయానికి వారు షూటింగ్ పూర్తి చేయలేకపోయారని, ఉస్తాద్ భగత్ సింగ్ స్క్రిప్ట్ కూడా తాను చెప్పిన టైంకి రెడీ కాలేదని తెలిపారు.
ఓజీకి తాను సమయం కేటాయించడం వల్లే త్వరగా పూర్తయిందని, తాను లేని పార్ట్ లు షూట్ చేయమని చెప్పానని, ఆ తర్వాత తాను వచ్చి షూటింగ్ పూర్తి చేస్తానని వారికి చెప్పానని పవన్ అన్నారు. తాను 10 రోజులు షూటింగ్ చేస్తే హరిహర వీరమల్లు పూర్తవుతుందని, అదే మొదట రిలీజ్ అవుతుందని అన్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates