కొన్ని పెద్ద హీరోల క్యాస్టింగ్ ఎంపికల వెనుక ఆశ్చర్యపరిచే బ్యాక్ స్టోరీస్ ఉంటాయి. అలాంటిదే ఇది. బాలకృష్ణతో హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్ పూర్తి చేసిన దర్శకుడు బోయపాటి శీను ప్రస్తుతం అఖండ 2 తాండవం చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం దీని షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతోంది. సెప్టెంబర్ 25 విడుదల తేదీ ముందే ప్రకటించేయడంతో దానికి అనుగుణంగా పక్కా ప్లానింగ్ తో షెడ్యూల్స్ వేస్తున్నారు. స్కంద చేసిన గాయం నుంచి కోలుకుని కంబ్యాక్ అవ్వాలని బోయపాటి కష్టపడుతుండగా బాక్సాఫీస్ దగ్గర దూసుకుపోతున్న ట్రాక్ రికార్డుని కొనసాగించాలని బాలయ్య పట్టుదలతో ఉన్నారు.
ఇదిలా ఉండగా అఖండ 2లో చిన్న బాలయ్య కూతురి పాత్ర కోసం సీనియర్ హీరోయిన్ లయ వారసురాలు శ్లోకాని తీసుకున్నట్టు లేటెస్ట్ అప్డేట్. ఇక్కడే ఒక విశేషం ఉంది. బాలకృష్ణ, లయ జంటగా 2004లో విజయేంద్రవర్మ వచ్చింది. ఆడలేదు కానీ ఆడియో పరంగా పాటలు ప్లస్ అయ్యాయి. అందులో చిన్న పాపగా ఇప్పటి బలగం హీరోయిన్ కావ్య కళ్యాణ్ రామ్ నటించింది. ఈ సినిమా చేసేనాటికి లయకు పెళ్లి కాలేదు. ఇప్పుడు తన కూతురిని బాలయ్య సినిమాతో లాంచ్ చేయడం కాకతాళీయమే అయినా ఇంటరెస్టింగ్ అనిపిస్తోంది కదా. కథ బాగా నచ్చడం వల్లే లయ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం.
అఖండలో క్లైమాక్స్ లో చూపించినట్టు అఖండ 2లో పాప సెంటిమెంట్ కీలకం కానుంది. నీకు ఆపద వచ్చినప్పుడు నేను తిరిగి వస్తానని అఘోరా ప్రమాణం చేయడంతో ఆ కథ ముగుస్తుంది. నిజంగా అలా జరిగితే ఏంటి అనే పాయింట్ తోనే బోయపాటి శీను సీక్వెల్ రాసుకున్నారట. ఇందులో దాదాపుగా అఘోరా పాత్ర డామినేషనే ఉంటుందని యూనిట్ టాక్. తమన్ సంగీతం మీద భారీ అంచనాలున్నాయి. వదలకుండా వరసగా అయిదో సినిమా ఇచ్చిన బాలయ్య నమ్మకాన్ని మళ్ళీ నిలబెట్టుకుంటాడని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. సంక్రాంతికి వచ్చే డాకు మహారాజ్ లోనూ ఈ కాంబో రిపీట్ కానుంది.